మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ఇపుడు ఈ పేరు వింటే చాలు.. ఫ్యాన్స్‌కు పూనకాలే. ఎందుకంటే చెర్రీ లేటెస్ట్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్ సంచలనం అలాంటిది మరి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి క్రియేటివిటీకి, మెగా వారసుడు యాక్షన్ తోడైతే ఎలా ఉంటుందో చాటి చెప్పిన ప్యాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ ప్రభంజనం నేపథ్యంలో మార్చి 27న రాంచరణ్ పుట్టిన రోజు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. అలాగే గత ఏడాది రాంచరణ్ పుట్టినరోజుకు స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ మరిపుడు రామరాజు బర్త్‌డేకు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తుందా అని కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
మెగా పవర్‌స్టార్ రాంచరణ్ గురించి పరిచయం అవసరమే లేదు. అలనాటి దివంగత ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, మెగాస్టార్ చిరంజీవిగా కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, హీరోగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ‘చిరుత’గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీసు వద్ద విజయాన్ని సాధించాడు. ఆ తరువాత పెద్దగా కమర్షియల్ హిట్స్ సాధించలేకపోయినా, నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు.
2007లో తొలి మూవీతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా ఫిలింఫేర్ అవార్డు, నందీ స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కించుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర సంచలనం సృష్టించింది. ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు చెర్రీ ఖాతాలో చేరాయి. కాలభైరవగా, రొమాంటిక్ హీరోగా చరణ్ ఆడియెన్స్‌లో తనకంటూ స్పెషల్ గుర్తింపును తెచ్చుకున్నాడు.
అయితే 2010లో ఆరెంజ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆరెంజ్ మూవీ పాటలు సక్సెస్ అయినప్పటికీ, కమర్షియల్ కూడా ఘోరంగా ఫెయిల్ అయింది. అయితే చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, 2013లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో నాయక్, పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఎవడు మూవీ కూడా సో.. సో గానే నడిచాయి. పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయాయి.
ఈ క్రమంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బ్లాక్ బ్లస్టర్ జంజీర్‌కి రీమేక్‌గా, అపూర్వ లాఖియా దర్శకత్వంలో తెరకెక్కిన తుఫాన్ మూవీ కూడా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే, 2015లో శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ సినిమాలు ఇదే బాటలో పయనించాయి. ఆశించిన కలెక్షన్లను రాబట్ట లేక పోయాయి. అయితే 2016లో వచ్చిన ధృవ చిత్రం కాస్త ఊరట నిచ్చింది. ఈ విజయానికి కొనసాగింపుగా వచ్చిన రంగస్థలం మూవీ సూపర్ డూపర్ హిట్టయింది.
ముఖ్యంగా వికలాంగుడిగా రాంచరణ్ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. 2018 లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చిట్టిబాబుగా నట విశ్వరూపం ప్రదర్శించాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కలగలసి టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన మూవీ రంగస్థలం. ఈ సినిమా సక్సెస్‌తో రాం చరణ్ ఇమేజ్ భారీగా పెరిగింది. కానీ 2019 జనవరిలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ మళ్లీ ఫ్లాప్‌నే మూట గట్టుకుంది.
అయినా సాలిడ్ హిట్ కోసం ఓపిగ్గా వెయిట్ చేసి చివరికి మరో బ్లాక్ బ్టస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మూవీ ఆర్‌ఆర్‌ఆర్. కోవిడ్ కష్టాలు, దాదాపు రెండేళ్ల కృషి, ఫ్యాన్స్ భారీ అంచనాల మధ్య రాంచరణ్, రాజమౌళి, ఎన్టీఆర్, కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ భారీ హిట్ టాక్‌తో దూసుకు పోతోంది. రామరాజుగా చెర్రీ యాక్షన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. భారీ వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసేందుకు రడీ అవుతోంది. రాం చరణ్ కేవలం నటుడు మాత్రమే కాదు సక్సెస్‌ఫుల్ ఆంట్రపెన్యూర్ కూడా. హార్స్ రైడింగ్ అంటే ఇష్టపడే చెర్రీకి 'హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్' తోపాటు ట్రూజెట్ అనే సొంత ఎయిర్‌లైన్స్ కూడా ఉంది. ఇక ఆర్‌సి భార్య ఉపాసన అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించి కీలక బాధ్యతల్లో ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment