పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలోకి రానుందా? అంటే అవుననే అంటోంది పీపుల్స్ పల్స్ సర్వే. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని అంచనా వేసింది. హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. దీని ఆధారంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 59 నుంచి 66 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికార కాంగ్రెస్ 23 నుంచి 28 స్థానాలు గెలుచుకునే చాన్స్ ఉంది. శిరోమణి అకాలీదళ్‌కు 17 నుంచి 21 సీట్లు, బీజేపీకి 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇతరులు ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో పాగా వేయనున్నారు.
‘ఆప్’కు అత్యధిక ఓట్లు
ఓట్ల శాతాన్ని పరిగణన లోకి తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 40 శాతం ఓట్ షేర్ రానుంది. కాంగ్రెస్ పార్టీకి 30 శాతం, అకాలీదళ్‌కు 20 శాతం, బీజేపీకి 8 శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు రావొచ్చని సర్వే అంచనా వేసింది. 2017 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన 23 శాతం ఓట్ షేర్‌కు ఈసారి అదనంగా 17 శాతం కలుస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో 38.5 శాతం ఓట్లు రాగా, ఈసారి అందులో 8.5 శాతం తగ్గుతుందని తెలిపింది. తమ అంచనాలు ఐదు శాతానికి అటుఇటుగా ఉండొచ్చని పీపుల్స్ పల్స్ పేర్కొంది.
సీఎంగా భగవంత్ మాన్!
ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ మాన్‌పైపు పంజాబ్ ప్రజలు మొగ్గు చూపారు. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ రెండో స్థానానికి పడిపోయారు. భగవంత్ మాన్.. ముఖ్యమంత్రి కావాలని 39 శాతం మంది, ఛన్నీ సీఎం కావాలని 30 శాతం మంది కోరుకున్నారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌వైపు 20 శాతం మంది మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పంజాబీలు గట్టిషాక్ ఇచ్చారు. కేవలం 6 శాతం మంది మాత్రమే ఆయన సీఎం కావాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను కోరుకునే వారి సంఖ్య 3 శాతం మాత్రమే. వీరెవరూ వద్దని 2 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అలా జరిగేలా లేదు!
ధరల పెరుగుదల, నిరుద్యోగం, కనీస మద్దతు ధర, అక్రమ ఇసుక తవ్వకాలు, మద్యం మాఫియా, మాదకద్రవ్యాల ముప్పు, అవినీతి, పెరుగుతున్న రాష్ట్రం అప్పులు గురించి పంజాబ్ ప్రజలు ఎక్కువగా సర్వేలో ప్రస్తావించారు. ప్రభుత్వ వ్యతిరేకత.. ఆమ్ ఆద్మీ పార్టీకి సానుకూలంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. 'యాక్సిడెంటల్' ముఖ్యమంత్రిగా తెర మీదకు వచ్చిన చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ సంఖ్యాపరంగా బలమైన షెడ్యూల్డ్ కులాల (32 శాతం) ఓట్లను గణనీయంగా సంపాందించి పెడతారన్న అంచనాలు ఉన్నాయి. దళితులకు అండగా ఉంటే కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చే అవకాశముందని.. కానీ అలా జరిగేలా కనిపించడం లేదని సర్వే వెల్లడించింది. పంజాబ్‌లో అధికారి మార్పిడి జరగాలని ఆప్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లినట్టు తెలుస్తోంది. అలాగే ఢిల్లీ తరహాలో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ ఇచ్చిన ‘ఢిల్లీ మోడల్’హామీ కూడా వర్కవుట్ అయినట్టుగానే కనబడుతోంది. రీజియన్ల వారీగా చూసుకుంటే... మాల్వా ప్రాంతంలో ఆప్ హవా ఉంది. దోబా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఆప్ గట్టి పోటీ ఇచ్చినట్టు సమాచారం. మజా ప్రాంతంలో అకాలీదళ్, ఆప్ హోరాహోరీ తలపడినట్టు కనబడుతోంది.
సర్వే ఇలా..
ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత 25 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించినట్టు పీపుల్స్ పల్స్ వెల్లడించింది. 53 శాతం మంది పురుషులు, 47 శాతం మహిళలను సర్వే చేసినట్టు తెలిపింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసుకుని వివిధ సామాజిక వర్గాల చెందిన 18 నుంచి 60 ఏళ్లు పైబడిన వారి అభిప్రాయాలు సేకరించారు.
ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి?
ఆమ్ ఆద్మీ పార్టీకి 76 నుంచి 90 సీట్లు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 19 నుంచి 31.. అకాలీదళ్‌కు 7 నుంచి 11, బీజేపీకి ఒకటి నుంచి 4, ఇతరులకు 2 స్థానాలు దక్కే అవకాశముంది.
న్యూస్-18 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆప్‌కు 60, కాంగ్రెస్‌కు 27, అకాలీదళ్‌కు 25 సీట్లు వస్తాయని అంచనా.
ఆత్మసాక్షి అంచనా ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 58 నుంచి 61, కాంగ్రెస్ పార్టీకి 34 నుంచి 38, అకాలీదళ్‌కు 18 నుంచి 21, బీజేపీకి 4 నుంచి 5 సీట్లు గెల్చుకునే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment