ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఈ పేరు వింటనే ఈ ఏడాది ఎంతో మంది పొలిటికల్ లీడర్లు, ప్రముఖులు వణికిపోయారు. ఎందుకంటే 2022లో ఈడీ దాడుల కారణంగా కొన్ని వందల కోట్ల అక్రమ సంపాదన బయటకు వచ్చింది. దీంతో, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రముఖ రాజకీయ నేతలతో సహా ప్రముఖులు సైతం జైలు ఊసలు లెక్కబెట్టారు. కానీ, వీరంతా ప్రతిపక్ష నేతలు కావడంతో కేంద్రం తీవ్ర విమర్శులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఈడీ దాడులు జరగడం విశేషం. ఈడీ జోరు పెంచిన కారణంగా ఈ ఏడాదిని ‘ఈడీనామ సంవత్సరం’గా పేర్కొనవచ్చు..
1. నేషనల్ హెరాల్డ్ కేసు..
ఈ కేసులో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటుగా రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలను ఈడీ ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ముందుగా రాహుల్ గాంధీ.. ఈడీ అధికారుల ఎదుట హాజరవుతున్న క్రమంలో ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈడీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఢిల్లీలో ర్యాలీ తీశారు. దీంతో, ఉద్రిక్తత నెలకొంది. ఈడీ అధికారులు రాహుల్ గాంధీని ఐదు రోజుల్లో దాదాపు 50 గంటల పాటు విచారించారు. ఇక, ఈడీ విచారణ అనంతరం.. తన ఓర్పును చూసి ఈడీ అధికారులే షాక్ అయ్యారని రాహుల్ చెప్పుకొచ్చారు.
తర్వాత ఈ కేసులో ఈడీ.. సోనియాను విచారించింది. కాగా, ఈడీ విచారణకు ముందే సోనియా కరోనా బారినపడటంతో విచారణ ఆలస్యమైంది. అనంతరం, సోనియా.. ఈడీ విచారణను హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం ఈడీ నడుచుకుంటోందని, ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సోనియా గాంధీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. వీరి విచారణల అనంతరం, ఈడీ అధికారులు.. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ సహా మరికొంత మందికి నోటీసులు ఇచ్చి విచారించింది. ఈ క్రమంలో ఈడీ విచారణ రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించింది.
2. బెంగాల్లో పార్థా చటర్జీ ప్రకంపనలు..
మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న బెంగాల్‌లో ఈడీ దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారాయి. బెంగాల్ విద్యాశాఖ మంత్రి, టీఎంసీ నేత పార్థా చటర్జీ.. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఈడీ అధికారులు మంత్రి పార్థా చటర్జీ సహా, అర్పిత ముఖర్జీని అరెస్ట్ చేశారు. ఇక, వీరి విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. టీచర్ పోస్టులకు, బదీలీలకు పార్థా చటర్జీ భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ కేసులో దాదాపు 50 కోట్ల రూపాయల నగదు.. కిలోల్లో బంగారం, లగర్జీ కార్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. దీంతో, సీఎం మమత.. టీఎంసీ నుంచి పార్థా చటర్జీని తొలగించారు.
3. పంజాబ్‌లో మైనింగ్ కేసు..
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ బావమరిది భూపేందర్ సింగ్ హనీపై ఇసుక మాఫియా కేసులో భాగంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. ఈ కేసులో విచారణలో భాగంగా ఈడీ అధికారులు దాదాపు రూ.10 కోట్లు, 21 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భాగంగా మాజీ సీఎం ఛన్నీని కూడా ఈడీ విచారించింది.
4. జార్ఖండ్ సీఎంకు ఈడీ షాక్..
అక్రమ మైనింగ్ వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. ఇదే కేసులో సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాను ఈడీ అరెస్టు చేసింది. అతనిపై మనీ లాండరింగ్ కేసు నమోదుచేసిన అధికారులు.. జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మిశ్రాతోపాటు అతని వ్యాపార భాగస్వాముల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 బ్యాంకు అకౌంట్లలో రూ.13.32 కోట్ల నగదును సీజ్ చేశారు. మే నెలలో సీఎం సోరెన్‌తోపాటు జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ ఇంట్లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఇదే క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను కేటాయించుకున్నారని, సీఎం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర గవర్నర్‌కు కేంద్ర ఎన్నికల సంగం సూచించిన విషయం తెలిసిందే. దీంతో, ఈ కేసు వ్యవహారం జార్ఖండ్‌లో సోరెన్ తన సీఎం పదవి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ కేసు రాష్ట్రంలోనే కాకుండా రాజకీయంగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
5. ఢిల్లీలో ఆప్‌ను తాకిన ఈడీ..
ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఈడీ అధికారులు షాకిచ్చారు. మనీలాండరింగ్ కేసులో మే ౩౦వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని 2017 ఆగష్టు 24వ తేదీన సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. ఆ ఎఫ్‌ఐఆర్ కాపీ ఆధారంగా ఈడీ ఇన్విస్టిగేషన్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే సత్యేంద్రను మే ౩౦వ తేదీన అరెస్ట్ చేసి తీహార్ జైలులో పెట్టారు. అరెస్ట్ అనంతరం.. ఆయన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే జైలులో మంత్రి సత్యేంద్ర జైన్‌కు వీఐపీ సేవలు అందుతున్నాయనే వార్తలు, వీడియోలు బయటకు వచ్చాయి. జైలులో మసాజ్, ఇంటి ఫుడ్ తీసుకున్న వీడియోలు లీక్ అయ్యాయి. దీంతో, ఈ వ్యవహారంలో ఈమధ్యే తీహార్ జైలు సూపరింటెండెంట్‌ని సస్పెండ్ చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి అదే జైలులో ఉన్న సహ నిందుతులను సత్యేంద్ర పదే పదే కలుస్తున్నారని, తద్వారా ఈ కేసుని ప్రభావితం చేస్తున్నారని ఈడీ ఆరోపిస్తోంది. దీంతో, సత్యేంద్ర జైన్ జైలు వ్యవహారం దేశంలో హాట్ టాపిక్ మారింది.
6. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ షాక్..
మహారాష్ట్రలో పాత్రా చాల్ కుంభకోణానికి సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో భాగంగా ముంబైలోని సంజయ్ రౌత్ ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులు లెక్కల్లో చూపని నగదును గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. పాత్రా చాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌ను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. మనీ ల్యాండరింగ్ కేసులో రూ. 11 కోట్ల నగదు, పత్రా చాల్ ల్యాండ్ స్కామ్ కేసులో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇక, ఈ కేసులో దాదాపు 100 రోజులు జైలు జీవితం గడిపిన అనంతరం.. కోర్టు సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరు చేయడంతో రౌత్ విడుదలయ్యారు.
7. దావూద్ ఇబ్రహీం కారణంగా నవాబ్ మాలిక్ అరెస్ట్..
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్‌సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది. పీఎంఎల్‌ఏ (అక్రమార్జన నిరోధక చట్టం) కింద మాలిక్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. దావూద్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన ఒక ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మాలిక్‌పై కేసు నమోదు చేసింది. ముంబై దాడులతో సంబంధమున్నవారితో మాలిక్‌కు స్థిరాస్తి సంబంధాలున్నాయని, అందువల్ల ఆయన్ను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో, ఈ వ్యవహారం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. ఈ కేసులో భాగంగా ముంబైలో దావూద్ హవాలా లావాదేవీలతో సంబంధం ఉందంటూ దావూద్ సోదరి, సోదరుడు, చోటా షకీల్ బావమరిది సహా పలువురికి సంబంధించిన ఇళ్లపై ఈడీ రైడింగ్‌లు జరిపి కేసు నమోదు చేసింది. గతంలో దావూద్ తదితరులపై ఎన్‌ఐఏ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అంశాల ఆధారంగా ఈడీ దాడులు నిర్వహించింది. 2005లో ముంబైలోని కుర్లా ప్రాంతంలోని రూ.300 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ.55 లక్షలకే మాలిక్ పొందాడని ఈడీ తెలిపింది. ఇందులో ఆయనకు దావూద్ సోదరి హసీనా పార్కర్‌తో పాటు దావూద్ సన్నిహితులు సాయం చేశారని తెలిపింది. దావూద్‌తో మాలిక్‌కు సంబంధం ఉందన్న ఆధారాల్లేవని మాలిక్ న్యాయవాదులు చెప్పారు. ఈడీ చెబుతున్న లావాదేవీ 1999కి సంబంధించినదని తెలిపారు. ఇక, మాలిక్ అరెస్ట్‌ను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలువురు నేతు ఖండించారు.
8. ఢిల్లీ లిక్కర్ స్కాం..
దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అమిత్ అరోరా సహా పలువురు అరెస్ట్ అయ్యారు. ఇక, ఈ కేసులో ఈడీ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇండోస్పిరిట్ కంపెనీకి ఢిల్లీలో ఎల్1 లైసెన్సుతో వచ్చిన షాపుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వాటా ఉందని ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కాం ద్వారా సంపాదించిన ఈ ఆదాయంలో ఎక్కువ భాగం కవితకు చేరినట్టు ఈడీ ఆరోపించింది. లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో ఏర్పాటుచేసిన మీటింగ్‌లో కవితతో పాటు అమిత్ అరోరా, దినేశ్ అరోరా, సమీర్ మహీంద్రు పాల్గొన్నారని ఈడీ చార్జిషీట్‌లో ప్రస్తావించింది. కవిత వాడిన ఫోన్ల వివరాలను, వాటిని ఐఎంఈఐ నంబర్లను కూడా ఈడీ ప్రస్తావించింది. ఇక, ఇదే కేసులో గతంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఈ కేసులో భాగంగానే కవితను సీబీఐ కూడా విచారించింది.
9. విజయవాడ ఆసుపత్రుల్లో ఈడీ దాడులు..
విజయవాడలోని ఆసుపత్రుల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లా చినకాకానిలోని ‘ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్’లో అక్రమాలపై ఈడీ కొరడా ఝుళిపించింది. ఆ అకాడమీ నిర్వహిస్తున్న ఆస్పత్రి, మెడికల్ కాలేజీల నిధులను నిబంధనలకు విరుద్ధంగా కొల్లగొట్టడంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రితోపాటు విజయవాడలో నివసిస్తున్న ఆ ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఉప్పలాపు శ్రీనివాసరావు, వల్లూరిపల్లి నళినీమోహన్‌ల నివాసాలలో 40 ఈడీ బృందాలు ఏకకాలంలో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. రెండు ఆస్పత్రుల్లో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ సీట్ల అమ్మకం, అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో పెట్టుబడులపై ఆరా తీశారు. దాదాపు రూ.100 కోట్లు వరకు ఆర్థిక వ్యవహారాలు నడిచినట్లు సమాచారం.
10. గ్రానైట్ విషయంలో గంగులపై ఈడీ దాడి..
టీఆర్‌ఎస్ మంత్రి గంగుల కమలాకర్‌ను ఈడీ టార్గెట్ చేసింది. గంగుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో సోదాలు నిర్వహించారు. గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్‌తో పాటు కరీంనగర్‌లోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్ కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గంగులతో పాటు ఇతర గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకే సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. అనంతరం, గంగుల కమలాకర్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
- ఇవే కాకుండా.. ఎంపీ కార్తీ చిదంబరం చైనా వీసా కేసులో కూడా ఆయన్ను ఈడీ విచారించింది. ఈ కేసులో చిదంబరం మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ పేర్కొంది. యస్-బ్యాంక్, డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఫ్రాడ్ కేసులో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా రూ. 415 కోట్లను ఈడీ ఎటాచ్ చేసింది. జమ్మూ-కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ వ్యవహరంలో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment