2022 REWIND: నువ్వా-నేనా! ఈ ఏడాదంతా రాజకీయ దుమారమే.. | Year End 2022: Political War In Karimnagar Between BRS And BJP | Sakshi
Sakshi News home page

2022 REWIND: నువ్వా-నేనా! ఈ ఏడాదంతా రాజకీయ దుమారమే..

Published Thu, Dec 29 2022 12:07 PM | Last Updated on Thu, Dec 29 2022 12:17 PM

Year End 2022: Political War In Karimnagar Between BRS And BJP - Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఈ ఏడాది మొత్తం రాజకీయ యుద్ధాలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వేదికగా నిలిచింది. ‘నువ్వా–నేనా’ అన్న స్థాయిలో సాగిన మాటల యుద్ధాలకు ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన పలు బహిరంగ సభలు సాక్షిభూతాలుగా నిలిచాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య సాగిన రాజకీయ పోరు ఏడాది పొడవునా.. ఆసక్తిని రగిలించాయి. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని మోదీ వరకు, మంత్రి గంగుల నుంచి బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ వరకు మాటల యుద్ధాలు రాజకీయ ఉత్కంఠకు తెరతీశాయి.

ఇక రెండు పార్టీల్లోనూ పలువురు సీనియర్లు అలకబూనారు. సీనియర్లు, జూనియర్ల మధ్య ఏర్పడ్డ వైరం పరస్పర ఫిర్యాదుల వరకు వెళ్లినా.. అవన్నీ టీ కప్పులో తుఫానులా సమసిపోయాయి. ఏడాది ఆరంభంలో కరోనా మూడో వేవ్‌ భయబ్రాంతులకు గురిచేసినా.. ప్రాణనష్టం లేకుండా ముగిసింది. దీంతో అభివృద్ధి పనులు సైతం యథావిధిగా కొనసాగాయి. బీజేపీ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్రలు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పర్యటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్లాంటు ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్రమోదీ(ఫైల్‌)

ఏడాదిలో జరిగిన పరిణామాలను పరిక్షించి చూస్తే..!
జనవరి02.. బండి సంజయ్‌ అరెస్టు..: జీవో 317 అమలుకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, స్థానిక ఎంపీ బండి సంజయ్‌ చేపట్టిన నిరసన దీక్ష రణరంగంగా మారింది. బండి సంజయ్‌ను అరెస్టు చేయడం, సీపీ స్వయంగా లాఠీఛార్జి చేయడం సంచలనం రేపింది. ఆ తరవాత బండికి పోలీసులు రిమాండ్‌ విధించడంతో కరీంనగర్‌కు జాతీయ నేతల తాకిడిమొదలైంది. ఈ వ్యవహారం అప్పుడు పార్లమెంటరీ ప్రివిలేజ్‌ కమిటీ వరకు వెళ్లింది.

జనవరి 13.. కమలంలో కుంపట్లు..: జిల్లాలో మూడు వర్గాలుగా విడిపోయిన కమలం నేతలు పార్టీ కార్యక్రమాలు సమాచారం ఇవ్వట్లేదని ఆవేదనతో బండి సంజయ్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ నాయకత్వానికి తరుణ్‌చుగ్‌ నివేదిక ఇవ్వడంతో సీనియర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అనంతరం వారి వివరణతో వ్యవహారం సద్దుమణిగింది.

జనవరి 26: గులాబీ పార్టీ జిల్లా అధిపతులుగా జీవీ రామక్రిష్ణారావు (కరీంనగర్‌), కల్వకుంట్ల విద్యసాగర్‌రావు (జగిత్యాల), కే. చందర్‌ (రామగుండం), తోట ఆగయ్య (సిరిసిల్ల) బాధ్యతలు స్వీకరించారు.

ఫిబ్రవరి 09: కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామం సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యువజన దేశంలోనే ప్రథమస్థానం లభించింది. 
మార్చి 17: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మున్సి పల్‌ మంత్రి తారక రామారావు కరీంనగర్‌లో పర్యటించారు. దాదాపు రూ.1100 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు మెండి శ్రీలత, నక్కపద్మ టీఆర్‌ఎస్‌లో చేరారు.

జూన్‌ 11: వచ్చే ఏడాది జరిగే ఎన్నికల కోసం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జాతీయ అనలిటికల్‌ టీముల రహస్య సర్వే నిర్వహించాయి. ప్రశాంత్‌ కిశోర్, చాణక్య, సునీల్‌ కనుగోలు, ఇతర ప్రైవేట్‌ టీములు ముందస్తు ప్రచారం నేపథ్యంలో పలుమార్లు ప్రజాభిప్రాయ సేకరణ జరిపాయి.
జులై 11: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముందస్తు ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తితో ఉందని వ్యాఖ్యానించగా.. వీటిని ఖండిస్తూ మంత్రి గంగుల కమలాకర్‌ ఎదురుదాడితో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. 
జులై 31: గంగుల హరిహరణ్, చెన్నమనేని వికాస్, మేనేని రోహిత్, శ్రీరాం చక్రవర్తి తదితరులు వచ్చే శాసనసభ లేదా స్థానిక సంస్థల్లో పోటీ చేస్తారన్న ప్రచారం మొదలైంది. 

ఆగస్టు 05: ఉప ఎన్నిక జరిగిన తొమ్మిది నెలల తరువాత హుజూరాబాద్‌ చౌరస్తాలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ నిర్వహించిన సభ వేడి పుట్టించింది. ఈ సభను అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు రావడంతో వారిని పోలీసులు అరెస్టు చేసి తరలించారు.
ఆగస్టు 06: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు మెడికల్‌ అనుమతులు జారీ అయ్యాయి. కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రి బోధన ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆగస్టు 09: కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో మాజీ ఎంపీ పొన్నం పాదయాత్ర చేపట్టారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పెద్దమ్మ చౌరస్తా నుంచి ప్రారంభమైన యాత్ర 18న ఎల్కతుర్తిలో ముగిసింది.

ఆగస్టు 29: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పెద్దపల్లిలో కలెక్టరేట్‌ భవన సముదాయం, పార్టీ కార్యాలయం ప్రారంభించారు. గుజరాత్‌ గజదొంగలు మతం పేరు మీద కొట్లాడాలని రెచ్చగొడుతున్నారని, బీజేపీ ముక్త భారత్‌ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబరు 14: మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రవీందర్‌ అల్లుడు సోహాన్‌ సింగ్‌ ఆడియో లీకవవడంతో అతనిపై చర్యల కోసం జిల్లా నాయకులు కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు.

అక్టోబరు 28: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరుట్లలోని ఓబులాపూర్‌ బ్రిడ్జి వంతెన మీదుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పాదయాత్ర ద్వారా ప్రవేశించారు. నాలుగు జిల్లాలో పర్యటించి నవంబరు 17న హన్మకొండలో ప్రవేశించారు.
నవంబరు 13: ప్రధాని మోదీ రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం చేశారు. తప్పులు చేసిన వారిని వదలమంటూ పరోక్షంగా సీఎం కేసీఆర్‌కు హెచ్చరికలు జారీ చేశారు.
నవంబరు 27: ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు వెళ్తున్న బండి సంజయ్‌ను జగిత్యాల వద్ద పోలీసులు అరెస్టు చేసి, అర్ధరాత్రి ఇంటికి తరలించారు. మరునాడు కోర్టు అనుమతితో ఆయన భైంసాకు తరలివెళ్లారు.

డిసెంబరు 7: జగిత్యాలో సీఎం పర్యటించారు. కలెక్టరేట్, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. మెడికల్‌ కాలేజీకి భూమి పూజ చేశారు. కొండగట్టు దేవాలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ప్రకటించారు. 
డిసెంబరు 8: మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ కూతురు వివాహానికి కరీంనగర్‌ వచ్చారు. అనంతరం మంత్రి గంగుల ఇంటికి వెళ్లారు. ఆఖరున రవీందర్‌సింగ్‌ను సివిల్‌ సప్లయ్‌ విభాగం చైర్మన్‌గా నియమించి వెళ్లారు. 
డిసెంబరు 10: ఉమ్మడి జిల్లాకు నూతన డీసీసీ ప్రెసిడెంట్లుగా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (జగిత్యాల), ఆది శ్రీనివాస్‌ (సిరిసిల్ల), మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ (పెద్దపల్లి), కవ్వంపల్లి సత్యనారాయణ (కరీంనగర్‌)లను ఏఐసీసీ నియమించింది.

డిసెంబరు 15: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సభ కరీంనగర్‌లో జరిగింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.
డిసెంబరు 26: జిల్లా సహకారం విద్యుత్తు సరఫరా సంఘం (సెస్‌)కు జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం 15 డైరెక్టర్‌ స్థానాలను ౖMðవసం చేసుకుని తిరుగులేని విజయాన్ని అందుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement