బరువు తగ్గేందుకు వినియోగించే ఔషధాల వల్ల కండరాల ద్రవ్యరాశి క్షీణించే ప్రమాదం ఉన్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. మధుమేహం, రక్తపోటు లాంటి జీవన శైలి వ్యాధులకు దారి తీసే ఊబకాయాన్ని నియంత్రించడంలో ఈ మందులు సమర్థంగా పని చేస్తున్నప్పటికీ బరువు కోల్పోయే ప్రక్రియలో కండరాలు క్షీణతకు గురయ్యే ముప్పు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
బరువు కోల్పోవడం కారణంగా కండరాలు క్షీణతకు గురైనప్పుడు వార్దక్య లక్షణాలు, హృద్రోగ జబ్బుల ముప్పు పెరుగుతాయి. ఈమేరకు పెన్నింగ్టన్ బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ (అమెరికా), ఆల్బర్టా, మెక్ మాస్టర్ వర్సిటీ (కెనడా)కి చెందిన పరిశోధకులు రూపొందించిన పత్రాలు లాన్సెట్ జనరల్‌లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, సెంట్రల్ డెస్క్
కండరాలు ఎందుకు అవసరం?
⇒ దేహానికి పటుత్వం చేకూర్చి శరీరాన్ని దృఢంగా ఉంచడంతోపాటు జీవ క్రియలు, వ్యాధి నిరోధక వ్యవస్థను నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి.
⇒ శరీర కదలికలు, ఆకృతికి కండర కణజాలం అవసరం.
ఏం చేయాలి?
⇒ బరువు కోల్పోయేందుకు తీసుకునే మందుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
⇒ ఆహారం తక్కువ తీసుకుంటే విటమిన్లు, ఖనిజాలు తగిన మోతాదులో అందకపోయే ప్రమాదం ఉంది.
⇒ తగినంత ప్రోటీన్లు తీసుకోవడంతోపాటు వ్యాయామాలు లాంటి ఆరోగ్యకరమైన విధానాలను పాటించాలి.
బరువు తగ్గించే మందులు ఏం చేస్తాయి?
డయాబెటిక్ బాధితులు, బరువు కోల్పోయేందుకు తీసుకునే ఓజెమ్‌పిక్, వెగావై, మౌన్జరో, జెప్‌బౌండ్ లాంటి మందుల్లో జీఎల్‌పీ – 1 రిసెప్టార్ఎగోనిస్ట్లు ఉంటాయి. ఒక రకమైన ప్రోటీన్లు లాంటి ఈ రిసెప్టార్లు రక్తంలో చక్కెర స్థాయిలు, జీవ క్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి పెంచే గ్లూకగాన్ హార్మోన్ విడుదలను అడ్డుకుంటాయి. ఆహారం తీసుకున్న తరువాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు ఇది దోహదం చేస్తుంది.
ఆకలిని కూడా ఇవే రిసెప్టార్లు నియంత్రిస్తాయి. కడుపు నిండిన భావన కలిగించడం ద్వారా బరువును నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి. ఈ రిసెప్టార్లను అనుకరిస్తూ టైప్ 2 డయాబెటిస్, ఊబకాయాన్ని నియత్రించే ఔషధాలు తయారయ్యాయి. మధుమేహ నియంత్రణలో వాడే మరికొన్ని మందులు మూత్రం ద్వారా గ్లూకోజ్‌ను బయటకు పంపి శరీర బరువును సమతూకంలో ఉంచేలా దోహదం చేస్తాయి. ప్రధానంగా మెదడులోని కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆకలిని అణచివేసి తక్కువ తీసుకునేలా ప్రోత్సహిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment