
నార్సింగి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు
రామాయంపేట(మెదక్): నార్సింగి మండలం శేరిపల్లిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, ఇది హత్యేనని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. శేరిపల్లి గ్రామానికి చెందిన ములుకల కిష్టయ్య (45) అదే గ్రామంలో నూతనంగా నిర్మించిన ఒక ఇంటికి గురువారం రాత్రి జరిగిన విందుకు వెళ్లాడు. రాత్రి 12 గంటల సమయంలో కొందరు కిష్టయ్యను ఆటోలో తెచ్చారు. మాట్లాడేస్థితిలో లేకపోవడంతో అతడిని ఇంటిలో పడుకోబెట్టి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఉదయం లేచిచూసే సరికి విగతజీవిగా కనిపించాడు. కిష్టయ్య ముక్కు నుంచి రక్తంకారుతుండటం గమనించారు.
ఈవిషయం తెలిసి గ్రామస్తులు మృతుడి ఇంటి వద్దకు తరలివచ్చారు. చనిపోయిన కిష్టయ్య మృతదేహాన్ని ఆటోలో తెచ్చారని కుటుంబ సభ్యులు విలపించారు. మృతదేహాన్ని తీసుకెళ్లి రాత్రి విందు జరిగిన ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధపడగా, సమాచారం అందుకున్న నార్సింగి ఎస్‌ఐ నర్సింలు గ్రామానికి వచ్చి వారిని సముదాయించారు. న్యాయం చేస్తామని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలించాలని సూచించారు. మృతుడి కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు నార్సింగి వచ్చి పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన వ్యక్తంచేశారు. ఎస్‌ఐ వారిని సముదాయించి రామాయంపేటకు తీసుకురాగా, వారు సీఐ చంద్రశేఖర్‌రెడ్డితో మాట్లాడారు. సీఐ మృతదేహాన్ని పరిశీలించారు. కిష్టయ్యకు భార్య తిరుపతమ్మ, ఇద్దరు కుమారులున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నర్సింలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment