
వరి కొయ్యలను కాల్చిన రైతులు
కౌడిపల్లి(నర్సాపూర్): వరి కోతలు పూర్తికాగానే రైతులు యాసంగి పనులు మొదలు పెట్టారు. వానాకాలం సీజన్‌లో కూలీల కొరత కారణంగా హార్వెస్టర్లతో వరి కోతలు కోయడంతో పొలంలో కొయ్యలు మిగిలాయి. పశుసంపద ఉన్న రైతులు గడ్డి సేకరిస్తుండగా.. మిగతా రైతులు వాటిని కాల్చివేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నష్టాలే ఎక్కువ. పొలంలో మిగిలిన కొయ్యలను, గడ్డిని కలియ దున్నడం వల్ల భూసారం పెరుగుతుందని కౌడిపల్లి మండలం తునికి వద్ద గల డాక్టర్ డి.రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ శాస్త్రవేత్త రవికుమార్ తెలిపారు. ఆయన రైతుల కోసం మరికొన్ని సూచనలు చేశారు.
నష్టాలు..
● వరి కొయ్యలను కాల్చడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయి.
● నేలకు మేలు చేసే క్రిమి కీటకాలు నశించడమే కాక భూసారం తగ్గిపోతుంది.
● నేలలో గడ్డిని కలియ దున్నడం వల్ల సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది.
● భూసారంతోపాటు దిగుబడులు పెరిగి రైతుకు మేలు జరుగుతుంది.
● వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది.
● విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది.
● ముఖ్యంగా నత్రజని, పాస్పరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుంది.
● భూమికి పీచు పదార్థంగా ఉపయోపగడే అవశేషాలు కాలిపోతాయి.
● పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి.
● పొలాల్లో తిరిగే పాములు, ముంగీసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాశులు చనిపోయే ప్రమాదం ఉన్నది.
● దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు కూడా ఒక్కోసారి బొగ్గవుతాయి.
ప్రయోజనాలు..
● వరి కొయ్యలు నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బన శాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశముంది.
● దుక్కి దున్నే సమయంలో సూపర్ పాస్పేట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి.
● ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది.
● దున్నడం వల్ల ఎకరాకు దాదాపుగా టన్ను ఎరువు తయారవుతుంది.
● మొక్కలకు 2 శాతం నత్రజని(యూరియా), 4 శాతం పాస్పరస్ అదనంగా అందిస్తుంది.
● జింక్, మాంగనీస్, ఇనుము, కాల్షియం లాంటి సూక్ష్మదాతువులు పంటకు మేలు చేకూర్చుతాయి.
● నేలలో కరగని మూలకాలను అనుకూలంగా మార్చుతుంది. నీటినిల్వ పెరుగుతుంది.
● కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే, గడ్డి ద్వారా పోషకాలన్నీ తిరిగి నేలకు చేరుతాయి.
వరి కొయ్యలకు నిప్పు పెడితే నష్టమే..
మిత్రపురుగులు, సూక్ష్మజీవులు చనిపోయే ప్రమాదం


రవికుమార్, తునికి కేవీకే సీనియర్ శాస్త్రవేత్త