
సొంతింటి కల.. నెరవేరేదిలా
ఇందిరమ్మ ఇళ్లకు వేగంగా అడుగులు ● వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలనికలెక్టర్ ఆదేశం ● ఇటీవల ఇందిరమ్మ పథకంపై సమీక్ష ● క్షేత్రస్థాయిలో మొదలైన కదలిక ● జిల్లాకు మొదటి విడత 17,500 ఇళ్లు ● 1.36 లక్షల మంది అర్హులు ఎంపిక
నారాయణఖేడ్: పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు జిల్లాలో అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుంది. పారదర్శకత పాటిస్తూ అర్హులు పథకంలో లబ్ధి పొందేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. అధునాతన ఏఐ సహాయాన్ని సైతం పథకంలో వినియోగించుకోనుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇదివరకే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను గుర్తించి వారిని కేటగిరీల వారీగా విభజించారు. జిల్లా మొత్తంలో 3,18,435మంది ఇళ్లకోసం అర్జీలు సమర్పించగా 1,36,821మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. వారిలో మొదటి కేటగిరీలో ఎంపికై న వారి ద్వారా ఇంటి నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇదివరకే అధికారులను ఆదేశించారు. ఇటీవల కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంజూరైన ఇళ్లకు మార్కింగ్ ఇచ్చి నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థిక సహాయం అందనుంది.
నియోజకవర్గానికి 3,500
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున 17,500 ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులను సొంత స్థలాలు ఉండి ఇళ్లులేనివారిని ఎల్1గా, సొంతస్థలం కానీ, ఇల్లు కానీ లేని వారిని ఎల్ 2గా, ఇతరులను ఎల్ 3గా జాబితాగా విభజించారు. కాగా, నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్ల సంఖ్య మేరకు మొదటి ఎల్ 1కింద ఎంపికై న వారిలో అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. జిల్లాకు 17,500 ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ప్రస్తుతం మాత్రం 3,939మంది జాబితాను మాత్రమే విడుదల చేశారు. మిగతా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.
రీ వెరిఫికేషన్..
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు రీ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని చొప్పున ఇదివరకే ప్రభుత్వం గుర్తించి ఆ గ్రామంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించింది. వారి మినహాయించి ఆయా మండలాల్లోని మిగతా గ్రామాలు, పట్టణాల్లో అర్హుల ఎంపికపై రీ వెరిఫికేషన్‌ను చేపట్టనున్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారు ఇళ్లకు వెళ్లి యాప్ ద్వారా ఇదివరకే నమోదు చేశారు. ఎల్ 1 జాబితాలో ఉండాల్సిన తమ పేర్లు ఎల్ 2, ఎల్ 3లో చేర్చాలని అధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు అలాంటి దరఖాస్తులపై రీ వెరిఫికేషన్ చేసి అతి పేదలను గుర్తించనున్నారు. ప్రతీ మండలానికి నాలుగైదు చొప్పున ప్రత్యేక బృందాలను అధికారులు నియమించనున్నారు.
పేదలపై భారం పడకుండా...
ఇంటినిర్మాణం భారం ఇటు ప్రభుత్వంపై, అటు పేదలపై పడకుండా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.5లక్షలు నిర్మాణానికి కేటాయించగా అందుబాటులో ఉన్న ఇసుక, తక్కువ ధరకు సిమెంట్, స్టీల్ అందజేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. నిర్మాణ సామగ్రి అయిన ఇసుక, సిమెంట్, స్టీల్ ఆకాశాన్నంటాయి. వీటిని తక్కువ ధరలో అందించిన పక్షంలో నిర్మాణాల్లో పెద్ద భారం తగ్గించినట్లవుతుంది. పేదలు సైతం అవసరానికి మించిన విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి నిధులు చాలక అసంపూర్తిగా వదిలేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న భావనతో తక్కువ విస్తీర్ణంలో నిర్మించుకునేలా చూస్తున్నారు. ఇందుకుగాను మండలానికి ఒక మోడల్ ఇందిరమ్మ ఇంటిని నిర్మిస్తున్నారు. పిల్లర్లు, బీములతో కూడిన నిర్మాణ పద్ధతికాకుండా ఖర్చు తక్కువయ్యే ఇతర పద్ధతులను అవలబించి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకుగాను కార్మికశాఖ ద్వారా మేసీ్త్రలకు శిక్షణ సైతం ఇస్తున్నారు.

సొంతింటి కల.. నెరవేరేదిలా
Comments
Please login to add a commentAdd a comment