ఏసీబీ వలలో మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
మెదక్ మున్సిపాలిటీ: ఏసీబీ అధికారులకు ఓ మున్సిపల్ ఆర్‌ఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్ పట్టణానికి చెందిన ధర్మగల్ల శివ కుమార్ తన సోదరి శైలజకు సంబంధించిన సర్వే నంబర్ 505/1/1/2 లోని 605 గజాల ఖాళీ స్థలాన్ని మ్యుటేషన్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమై సదరు అధికారి పని చేయకుండా పలుమార్లు తిప్పుకొని రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.12 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితుడు గత నెల 24న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం ఏసీబీ డీఎస్పీ సుదర్శన్, ఇన్‌స్పెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు బృందం పక్కా ప్రణాళికతో వలపన్నారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బాధితుడిద నుంచి మున్సిపల్ ఆర్‌ఐ జానయ్య రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంతోపాటు సూర్యాపేటలోని ఆర్‌ఐ ఇంట్లోనూ ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 8 గంటల పాటు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వివరాలు సేకరించారు. అనంతరం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జానయ్యను అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఈ సోదాలో సీఐలు వెంకటేశ్వర్లు, రమేశ్‌తోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్థ్థలం మ్యుటేషన్ కోసం రూ. 20 వేలు డిమాండ్
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
ఏకకాలంలో రెండు చోట్ల ఏసీబీ సోదాలు
అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలింపు
Comments
Please login to add a commentAdd a comment