
సర్వీసులు ఫుల్.. సౌకర్యాలు నిల్
సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి చౌరస్తాలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లలో కనీస వసతులు కరువయ్యాయి. ప్రయాణికుల సంఖ్య పెరిగినా సౌకర్యాలు మాత్రం మెరుగుపడటం లేదు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం నిత్యం బస్సులు రద్దీతో దర్శనమిస్తూ బస్టాప్ కిటకిటలాడుతుంది. ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలోని అంతర్ సర్వీసులతోపాటు హైదరాబాద్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలుస్తాయి. లింగంపల్లి చౌరస్తా నుంచి జహీరాబాద్ వరకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా, బుదేరా, కంకోల్, సదాశివపేట, కోహీర్ ప్రధానంగా దూర ప్రాంతాల సర్వీసులతోపాటు అంతర్రాష్ట్ర సర్వీసులను బస్టాండ్లలో నిలుపుతారు. వేసవికాలం సమీపించడంతో బస్సుల కోసం ప్రయాణికులు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. చౌరస్తా బస్టాండ్లో తాగునీరు, నీడలో కూర్చునేందుకు గూడారాల ఏర్పాట్లు, కనీస వసతులు కల్పించాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయిన పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బస్టాండ్లో వసతుల్లేక
ప్రయాణికుల ఇబ్బందులు
అవస్థలు పడుతున్నా
పట్టించుకోని అధికారులు
ఇబ్బందులు పడుతున్నాం
నిత్యం ఉద్యోగాలు, చదువుల కోసం హైదరాబాదుకు వెళ్తుంటాం. వందలాదిమంది ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉంటున్న పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఏ విధమైన ఏర్పాట్లు లేవు. తాగునీరు, మూత్రశాలలు లేక చాలా కష్టాలు పడుతున్నాం. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
–మాధవి, ప్రయాణికురాలు
గుడారాలను ఏర్పాటు చేయాలి
ఎండాకాలం సమీపించడంతో బస్టాండ్ వద్ద బస్సుల కోసం ఎక్కువ సేపు ఎండలో ఉండలేకపోతున్నాం. తాత్కాలికంగా గుడారాలను ఏర్పాటు చేయాలి. మహిళలు, వృద్ధులకు, చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
–రామస్వామి, ప్రయాణికుడు
అధికారుల దృష్టికి తీసుకువెళ్తాను..
సంగారెడ్డి చౌరస్తా ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో సౌకర్యాల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాను. రోడ్డు పనులు నడవటంతో బస్‌స్టాప్‌కు ఇబ్బందిగా ఉంది.
– ఉపేందర్,ఆర్టీసీ డిపో మేనేజర్

సర్వీసులు ఫుల్.. సౌకర్యాలు నిల్
Comments
Please login to add a commentAdd a comment