
దారులన్నీ దుర్గంధం
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025
పడకేసిన పారిశుద్ధ్యం
అస్తవ్యస్థంగా సంగారెడ్డి మున్సిపాలిటీ
● ఎక్కడ చూసినా చెత్తకుప్పలు..మురుగు కాల్వలే ● రోడ్ల వెంబడి డ్రైనేజీ దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు ● వెలగని వీధి దీపాలు...గుర్రపుడెక్కతో నిండిన చెరువులు ● నిరుపయోగంగా నిర్వహణకోసం తెచ్చిన వాహనాలు ● పౌరసేవల్లోనూ అంతే జాప్యం ● పాలనను గాలికొదిలేసినమున్సిపల్ అధికారులు
పట్టణంలోని వార్డులో పేరుకుపోయిన చెత్తాచెదారం
పాలక మండళ్ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనలోకి వచ్చిన సంగారెడ్డి మున్సిపాలిటీ మొత్తంగా పాలనకే దూరమైంది. మౌలిక సదుపాయాల కల్పన వాటి నిర్వహణ వంటి అంశాలను విస్మరించి పాలనను గాలికొదిలేయడంతో మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. రోడ్ల మీద ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దర్శనమివ్వడంతోపాటుగా చెత్తాచెదారంతో ప్రవహించని డ్రైనేజీలు రోడ్ల వెంట దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. దీనికితోడు పార్కుల నిర్వహణలోపం, పౌరసేవల్లో జాప్యం, రాత్రిళ్లు దోమలు స్వైరవిహారం, వెలగని వీధిదీపాలు వంటి సమస్యలు మున్సిపాలిటీని వేధిస్తున్నాయి.
సంగారెడ్డిజోన్...●
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్థంగా మారింది. ప్రత్యేకపాలనలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో 38 వార్డులు ఉండగా ఎక్కడ చూసినా చెత్తకుప్పలతో అపరిశుభ్రంగా మారిన పరిసరాలు దర్శనమిస్తున్నాయి. రాజంపేట, కలెక్టరేట్ ఎదుట, జిల్లా పరిషత్ కార్యాలయం, నాల్సాబ్ గడ్డ, గంజిమైదాన్, శాంతినగర్, కల్వకుంట రోడ్డు, 16వ వార్డు డీఎస్పీ ఆఫీసు వెనుకాల, వీరభద్రనగర్, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, సంగారెడ్డి చెరువు కట్ట తదితర వార్డుల్లో రోజులు గడుస్తున్నా చెత్తకుప్పలను మాత్రం తొలగించడం లేదు.
మురుగుకాల్వల్లో చెత్తాచెదారం
పట్టణంలోని ఇళ్లతోపాటు వ్యాపార సంస్థల నుంచి వచ్చే వ్యర్థ జలాలు సాఫీగా ప్రవహించేందుకు మురుగు కాల్వలను నిర్మించారు. గల్లీలో ఉండే చిన్న కాలువలతో పాటు రహదారుల పక్కన ఉన్న పెద్ద కాలువల్లో చెత్తాచెదారంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీరు ప్రవహించక దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. జిల్లా పరిషత్తు కార్యాలయం ముందు ఉన్న మురుగు కాలువ చెత్తాచెదారంతో నిండిపోయి ఉండటంతో మురుగునీరు ప్రధాన రహదారిపై ప్రవహిస్తోంది. పాతబస్టాండ్ ఎదుట ఉన్న మురికి కాలువ దాని ఆనవాళ్లు కనిపించకుండా మట్టి దిబ్బలతో నిండిపోయింది. కనీసం 10 రోజులకొకసారి మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేయాల్సి ఉన్నా నెలలు గడుస్తున్నా కార్మికసిబ్బంది వాటి జోలికే పోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు.
దోమల స్వైరవిహారం
ఇళ్ల మధ్యలో మురుగునీరు నిండిపోయి ఉండటంతో సాయంత్రం కాగానే దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమల కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. మున్సిపాలిటీలో దోమల నివారణకు ఫాగింగ్ చేయాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్మిక సిబ్బంది దోమల నివారణ చర్యలు చేపట్టడం లేదు. ఫాగింగ్ చేసినప్పటికీ నామమాత్రంగానే చేస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టానుసారంగా చెత్త సేకరణ... డంపింగ్
పట్టణంలో మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరణతోపాటు డంపింగ్ చేయటం పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ ఇంటి నుంచి తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలి. కానీ అందుకు విరుద్ధంగా తడి పొడి చెత్తను ఒకే దగ్గర సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించకుండా రోడ్డు పక్కన వేస్తున్నారు. కొన్నిసార్లు రోడ్డు పక్కనే నిప్పు పెడుతున్నారు. దీంతో వాహనదారులకు రాకపోకలు సాగించే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు.
నిరుపయోగంగా వాహనాలు
మున్సిపల్ అధికారులు మున్సిపల్ నిర్వహణ కోసం రూ.లక్షలు వెచ్చించి ఖరీదైన వాహనాలను తీసుకొచ్చారు. గత కొన్ని నెలలుగా వాటి నిర్వహణ చేపట్టకపోవటంతో అవి నేడు నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రజాధనం వృథాగా పోతుంది.
మార్కెట్ యార్డులో కనిపించని పరిశుభ్రత
సంగారెడ్డి పట్టణంలోని మార్కెట్ యార్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవటంతో పరిశుభ్రత కనిపించటం లేదు. మార్కెట్ యార్డు పూర్తిగా కుళ్లిన కూరగాయలు, చెత్తాచెదారంతో నిండిపోయింది.
కుండీల్లో కనిపించని మొక్కలు
జాతీయ ప్రధాన రహదారితోపాటు పట్టణంలోని ప్రధాన రహదారికిరువైపుల మొక్కలు నాటేందుకు కుండీలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో మొక్కలు నాటినా వాటి నిర్వహణ చేపట్టకపోవటంతో మొక్కలు ఎండిపోయాయి. పలుచోట్ల కుండీలు పగిలిపోయాయి. ఇక కుండీల్లో నాటిన మొక్కలు నిర్వహణ లేక ఎండిపోగా...మరికొన్ని ఏపుగా పెరిగి దారిని కమ్ముకుంటున్నాయి. ఇక పాతబస్టాండ్ ఎదురుగా ఉన్న డివైడర్ పగుళ్లు ఏర్పడి కూలేందుకు సిద్ధంగా ఉంది.
ఆహ్లాదాన్ని పంచని పార్కు
పట్టణ ప్రజల సౌకర్యార్థం మానసిక ఉల్లాసం, వ్యాయామం చేసేందుకు పట్టణంలో రాజీవ్ పార్కును ఏర్పాటు చేశారు. అధికారులు సరైన విధంగా నిర్వహణ చేపట్టకపోవటంతో పాడైపోయిన పరికరాలు దర్శనమిస్తున్నాయి. ఆట వస్తువులన్నీ నిరుపయోగంగా మారాయి. పట్టణ ప్రాంత ప్రజలు పార్కులకు వెళ్లేందుకు ఆసక్తి చూపటం లేదు.
గుర్రపుడెక్కతో నిండిన చెరువు
పట్టణంలోని మహబూబ్‌సాగర్ చెరువుతోపాటు నీటి కుంటలు చెత్తాచెదారంతో పాటు గుర్రపుడెక్కతో నిండిపోయింది. చెరువుతోపాటు ఇళ్ల మధ్యలో ఉన్న నీటి కుంటలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి.
వెలగని వీధి దీపాలు...
మున్సిపాలిటీలోని పలు కాలనీలలో వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదు. దీంతో రాత్రివేళల్లో కాలినడకన వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారని కాలనీల ప్రజలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పౌరసేవల్లోనూ అధికారుల అలసత్వం
మున్సిపల్ పరిధిలో కొత్తగా మురికి కాలువలు నిర్మించాలని కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేసిన నిర్మించలేకపోతున్నారు. తాగునీటి సమస్య తలెత్తితే సమస్య పరిష్కరించేందుకు అధికారులు శ్రద్ధ వహించడం లేదని, కార్యాలయానికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే గాని సమస్య పరిష్కరించడం లేదని ప్రజలు వాపోతున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకున్న వారికి వారం రోజుల్లో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నెలలు గడుస్తున్నా సర్టిఫికెట్లు జారీ చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సంగారెడ్డి మున్సిపాలిటీ వివరాలు
పట్టణంలోని వార్డులు: 38
జనాభా: 85,385 (2011 ప్రకారం)
వార్డులలోని విద్యుత్ దీపాలు: 12,604
ప్రతి రోజు పని చేసే కార్మికులు: 224
చెత్త సేకరణకు వాహనాలు : 50
వార్డు అధికారులు: 38
పట్టణంలో ఉన్న బోర్లు : 241
మిషన్ భగీరథ ట్యాంకులు: 14
మినీ ట్యాంకులు: 6
రోజుకు అవసరమయ్యే నీరు : 13.5 ఎంఎల్‌డీ
8లో
న్యూస్‌రీల్

దారులన్నీ దుర్గంధం

దారులన్నీ దుర్గంధం

దారులన్నీ దుర్గంధం

దారులన్నీ దుర్గంధం

దారులన్నీ దుర్గంధం

దారులన్నీ దుర్గంధం

దారులన్నీ దుర్గంధం

దారులన్నీ దుర్గంధం

దారులన్నీ దుర్గంధం

దారులన్నీ దుర్గంధం

దారులన్నీ దుర్గంధం
Comments
Please login to add a commentAdd a comment