
అంగన్‌వాడీలకూ ఒంటిపూట
నారాయణఖేడ్: ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం ఈ ఏడాది ఒంటిపూట బడులు మార్చి 15 నుంచే నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీలకు వచ్చేది ఐదేళ్లలోపు చిన్నారులు అయినా వారికి ప్రతీ ఏడు వేసవి ఎండలు మండుతున్నా ప్రభుత్వాలు, సంబంధిత శాఖ ఒంటిపూట బడుల నిర్వహణకు ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలకు మార్చి 15 నుంచి అమలు చేస్తున్నా అంగన్‌వాడీలకు మే మొదటి వారంలో ఒంటిపూట బడుల నిర్వహణకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చేవారు. దీంతో అంగన్‌వాడీకి వచ్చే చిన్నారులు, టీచర్లు, ఆయాలు ఇబ్బందులు పడేవారు. కాగా, ఈసారి ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతోపాటు అంగన్‌వాడీలకు సైతం ఒంటిపూట బడుల నిర్వహణకు అనుమతినిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మే 31వరకు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతాయి. ఆలోపే అంగన్‌వాడీలకు వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయడం, ప్రీస్కూల్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. 12.30గంటల తర్వాత సంబంధిత వార్షిక సర్వే, గృహాల సందర్శన, ప్రీ–స్కూల్‌లో పిల్లల నమోదు, డ్రాప్ అవుట్‌లను అంగన్‌వాడీల్లో తిరిగి చేర్చుకోవడంలాంటి తదితర పనులను చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలలో అంగన్‌వాడీ చిన్నారులకు వేసవి ఇబ్బందులు తీరనున్నాయి. జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట్, సదాశివపేట్, పటాన్‌చెరుల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,504అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఐదేళ్లలోపు చిన్నారులు 1,04,106మంది కేంద్రాలకు వస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలూ ఒంటిపూట
ప్రభుత్వ పాఠశాలలకు ప్రతీ ఏడాది తరహాలోనే ఈసారి కూడా ప్రభుత్వం ఈనెల 15 నుంచి ఒంటిపూట బడుల నిర్వహణకు ఉత్తర్వులిచ్చింది. దీంతో జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతన్న 1,17,184మంది విద్యార్థులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. ఉదయం 8గంటల నుంచి మధ్యా హ్నం 12.30గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. ఈనెల 21 నుంచి టెన్త్ పరీక్షలు కొనసాగనున్న కేంద్రాల్లో మాత్రం తరగతులను మధ్యా హ్నం నిర్వహిస్తారు. వార్షిక పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తారు.
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ పాఠశాలలతో సమంగానే
ఉదయం 8నుంచి మధ్యాహ్నం
12:30 గంటలవరకు నిర్వహణ
చిన్నారులకు వేసవిలో ఉపశమనం

అంగన్‌వాడీలకూ ఒంటిపూట
Comments
Please login to add a commentAdd a comment