
మరో ఇండస్ట్రియల్ పార్క్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కొత్తగా మరో ఇండిస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుమ్మడిదల మండల కేంద్రం పరిధిలో టీజీఐఐసీ (తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్) ఈ పార్కును ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 166 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ పార్కులో ఫార్మా పరిశ్రమలు కాకుండా ఆరెంజ్, గ్రీన్ కేటగిరీ పరిశ్రమల కోసమే ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఐఐసీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పార్కులో ప్రత్యేకంగా ఒకే రకమైన పరిశ్రమల కోసం ఏర్పాటు చేయడం లేదని, జనరల్ పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల భూములు కేటాయిస్తామని ఆ సంస్థ వర్గాలు చెబుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ పూర్తయి...భూములు అప్పగిస్తే లేఅవుట్ చేసి పరిశ్రమలకు కేటాయిస్తామని అంటున్నారు. ఇప్పటికే గుమ్మడిదల మండలంలో ఖాజీపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడలున్నాయి. ఇందులో ఫార్మా, బల్క్‌డ్రగ్ పరిశ్రమలే అధికంగా ఉన్నాయి. ఈ పరిశ్రమలతో ఈ ప్రాంతమంతా పూర్తిగా కాలుష్యంతో నిండిపోయింది. వాయుకాలుష్యంతోపాటు, భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కులో ఫార్మా పరిశ్రమలకు కేటాయింపులు ఉండవని అధికారులు చెబుతున్నారు.
ప్యారానగర్ డంప్‌యార్డు ఆందోళన
గుమ్మడిదల మండలంలో ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తున్న డంప్‌యార్డుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరూతూ నిత్యం ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే మండలంలో మరో ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణకు ప్రభుత్వ సమయాత్తమవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆందోళనలో రైతులు..
ఈ అసైన్డ్‌భూముల్లో దళిత, గిరిజన రైతులవే ఎక్కువగా ఉన్నాయి. దీంతో నిరుపేద రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నో ఏళ్లుగా ఈ భూములతో తమ జీవనాధారమని వాటిని ప్రభుత్వం లాక్కుంటే మా పరిస్థితి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. తమ భూములు ఇచ్చేది లేదని రైతులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే ఈ భూసేకరణకు సంబంధించిన రైతులతో రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా మాట్లాడారు.
అసైన్డ్ భూములే అధికం...
కొత్త ఇండస్ట్రియల్ పార్కు కోసం సేకరించనున్న భూముల్లో అసైన్డ్‌భూములే అధికంగా ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సాగుకు యోగ్యంగా లేని భూములే చాలామట్టుకు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ భూములోంచి నిత్యం అక్రమంగా మట్టితవ్వకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెబుతున్నారు.
గుమ్మడిదలలో ఏర్పాటుకు
టీజీఐఐసీ నిర్ణయం
భూసేకరణ ప్రక్రియ షురూ చేసిన
రెవెన్యూ అధికారులు
166 ఎకరాల భూములు సేకరణకు
ఆందోళనకు గురవుతున్న
భూములు కోల్పోతున్న రైతులు
ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు
వస్తాయంటున్న టీజీఐఐసీ
నోటిఫికేషన్ ఇచ్చాం
గుమ్మడిదల మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశాం. ఈ భూములు కోల్పోతున్న రైతులతో చర్చిస్తాం. ఇందుకోసం త్వరలో గ్రామసభ నిర్వహిస్తాం. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటైతే స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
– రవీందర్‌రెడ్డి,
భూసేకరణ అధికారి, సంగారెడ్డి ఆర్డీవో

మరో ఇండస్ట్రియల్ పార్క్
Comments
Please login to add a commentAdd a comment