ప్రతీ పౌరుడికి ఆధార్ గుర్తింపు కార్డు మాదిరిగానే, ప్రతీ రైతుకు కూడా ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శ్రీఫార్మర్ రిజిస్ట్రీశ్రీ పేరుతో ప్రతీ రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య కేటాయించనున్నారు. రాష్ట్రంలో ఇందు కోసం నాలుగు జిల్లాలను ఎంపిక చేయగా, సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన మొగుడంపల్లి రెవెన్యూ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు వీలుగా ఇటీవల ఏడీఏ భిక్షపతి వ్యవసాయ శాఖ సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ మొదటి వారంలో నమోదు ప్రక్రియను మొదలుపెట్టే అవకాశం ఉంది.
– జహీరాబాద్
రైతులకు గుర్తింపు కార్డును ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక యాప్ ద్వారా పేర్లు నమోదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక యాప్ ద్వారా ఆధార్ కార్డు మాదిరిగా రైతులకు ప్రత్యేక కోడ్ ఉండాలనే ఉద్దేశ్యంతో సాగుదారుల సంఖ్యను ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పీఎం కిసాన్, క్రాప్ లోన్, పంటల బీమా, యాంత్రీకరణ పరికరాలతోపాటు తదితర పథకాలను సాగుదారుల సంఖ్య ఆధారంగా అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు అందే రైతుల పథకాలు అమలు చేసేందుకు గాను ఇది ఉపయోగపడుతుంది. బ్యాంకులకు రుణాల కోసం వెళ్తే పట్టాదార్ పాసుపుస్తకం అవసరం లేకుండానే సాగుదారుల సంఖ్య కార్డును తీసుకెళ్తే సరిపోతుంది. కార్డు ద్వారా భూమికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది. ధాన్యం కొనుగోళ్లకు సైతం ఇదే కార్డును వర్తింపజేయనున్నారు.
రెవెన్యూ గ్రామం పరిధిలో 9 తండాలు
మొగుడంపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలో గ్రామంతోపాటు మరో తొమ్మిది తండాలు ఉన్నాయి. గ్రామంతోపాటు ఆయా తండాలకు సంబంధించిన రైతులు 4,123 మంది ఉన్నారు. గ్రామం పరిధిలో సుమారు 10 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. మొగుడంపల్లి రెవెన్యూ గ్రామం కిందకు పరిసరాల్లో ఉన్న పడియాల్‌తండా, విఠునాయక్‌తండా, మిర్జంపల్లితండా, లేతమామిడి తండా, మందగుబ్బడి తండా, నందునాయక్ తండా, హరిచంద్‌నాయక్‌తండా, చున్నంబట్టితండా, జాంగార్‌బౌలి తండాల రైతాంగానికి ఆధార్‌కార్డు తరహాలో పైలెట్ ప్రాజెక్టు కింద 11 అంకెల సాగుదారుల సంఖ్య పొందుపర్చిన కార్డులను ఇవ్వనున్నారు.
తగిన సమాచారంతో నమోదుకు వెళ్లాలి
రైతులకు అందించనున్న సాగుదారుల సంఖ్య కార్డు నమోదు కోసం తగిన సమాచారంతో వెళ్లాలి. మొగుడంపల్లి రైతు వేదికలో ప్రత్యేక యాప్‌ద్వారా నమోదు చేస్తారు. ఆధార్‌కార్డు లింకు ఉన్న సెల్‌ఫోన్ నంబరు, ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం తీసుకెళ్లాలి. వ్యవసాయ సిబ్బంది ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేస్తారు. అనంతరం రైతు సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఈ నంబర్‌ను సిబ్బందికి చెబితే 11 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు సంఖ్యను కేటాయిస్తారు. అందుబాటులో లేని రైతులు ఫోన్‌లో అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు చెబితే ప్రత్యేక నంబరును కేటాయిస్తారు.
ప్రత్యేక కార్టుల జారీకి ప్రభుత్వం చర్యలు
ఆధార్ తరహాలో 11 అంకెల సాగుదారుల సంఖ్య
రైతులకు సంబంధించి ప్రతీ పనికి ఈ కార్డు ఉపయోగం
మొగుడంపల్లి రెవెన్యూ గ్రామంపైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక
ఏప్రిల్ మొదటి వారం నుంచి శ్రీకారం
నమోదు ప్రక్రియకు ప్రత్యేక యాప్
ప్రభుత్వ పథకాలకు దోహదం
ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సాగుదారుల సంఖ్య ఎంతగానో ఉపయోగపడుతుంది. పట్టాదారు పాసుపుస్తకం లేకున్నా ప్రతీ పనికి తాము జారీ చేసే కార్డును తీసుకెళ్తే సరిపోతుంది. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయనున్నాం. వివరాల నమోదు కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానుంది. యాప్ రాగానే నమోదు ప్రక్రియను మొదలుపెడతాం. మొగుడంపల్లి నుంచి ప్రారంభించి పరిసరాల్లో ఉన్న తండాల్లో కొనసాగిస్తాం. జిల్లాలోనే మొగుడంపల్లిని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు.
–భిక్షపతి,జహీరాబాద్ ఏడీఏ
రైతులకు ‘గుర్తింపు’