ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలి
సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండ్రోజుల జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ శివారెడ్డి హాజరై మాట్లాడారు. విద్య ద్వారానే సామాజిక అభివృద్ధి జరుగుతుందన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలు తమ పిల్లలను తప్పనిసరిగా ఉన్నత విద్య చదివించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటే అసమానతలు తొలగుతాయన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి సరిపడా బడ్జెట్ కేటాయింపులు ఉండేలా చూసుకోవాలన్నారు. బీసీ కమిషన్ మెంబర్ బాల్‌లక్ష్మి మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు అందించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, సెమినార్ కన్వీనర్ డాక్టర్ శ్రద్ధానందం మాట్లాడుతూ ఇలాంటి సదస్సులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయని వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దిశగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ హుస్సేన్, డాక్టర్ రవినాథ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సదస్సులో విద్యార్థులకు వక్తల సూచన