బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని బేగంపేటలో గల అనందయ్య మఠంలోని సౌండ్ సిస్టానికి చెందిన ఆంప్లీపయర్‌ను శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. రోజులానే ఆలయం తాళం చెవిని ప్రాంగణంలో పెట్టి వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున వెళ్లేసరికి ఆంప్లీపయర్ కనబడలేదు. సుమారు 18 వేల విలువ ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. బెజ్జంకి పోలీసులకు సమాచారమివ్వగా విచారణ చేశారు. అలాగే ఆటో బ్యాటరీ సైతం చోరీకి గురైందని స్థానికులు తెలిపారు. తాళం చెవి తీసుకుని చోరికి పాల్పడ్డారంటే తెలిసిన వ్యక్తులేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పేకాట రాయుళ్ల అరెస్ట్
గజ్వేల్‌రూరల్: పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం ప్రకారం మండల పరిధిలోని అక్కారం శివారులో కొందరు పేకాట ఆడుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, గజ్వే ల్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 4 సెల్‌ఫోన్‌లతో పాటు రూ. 5,990 నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు.
భక్తుల సెల్‌ఫోన్ అపహరించిన మహిళ
దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగింత
కొమురవెల్లి(సిద్దిపేట): భక్తుల సెల్‌ఫోన్‌లు అపహరించిన మహిళకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని ఓ మహిళ ఓ భక్తుడి సెల్‌ఫోన్‌ను అపహరించేందుకు యత్నించగా అతడు అప్రమత్తమయ్యాడు. ఆమెను పట్టుకొని విచారించగా రెండు సెల్‌ఫోన్‌లు లభించాయి. దీంతో భక్తులు ఆమెకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి మందలించి వదిలిపెట్టినట్లు సమాచారం.
తండ్రిని చంపిన కొడుకు
గజ్వేల్‌రూరల్: తండ్రి, కొడుకు మధ్య నెలకొన్న వాగ్వాదంలో తండ్రిని కొడుకు చంపిన ఘటన గజ్వేల్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని పటేల్‌బజార్‌కు చెందిన ఎండీ షాబొద్దీన్(47), రజియాబేగంలకు కొడుకు షాకేర్, కూతురు ఉన్నారు. శనివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న షాబొద్దీన్‌కు, కొడుకు షాకేర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వంటింట్లోకి వెళ్లిన షాబొద్దీన్ కిందపడటంతో తలకు గాయాలయ్యాయి. వెంటనే భార్య అక్కడకు చేరుకొని అతడిని పక్కకు తీసుకెళ్లింది. అర్ధరాత్రి సమయంలో షాబొద్దీన్ నిద్రిస్తుండగా కొడుకు అతని మెడకు తాడును బిగించి చంపేందుకు ప్రయత్నించాడు. గమనించిన రజియాబేగం అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో షాబొద్దీన్ వద్దకు వెళ్లిచూడగా అతడు మృతి చెందినట్లు గుర్తించి చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఒంటరి మహిళ
దారుణ హత్య
జహీరాబాద్ టౌన్: ఒంటరి మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్‌లో చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... ఝరాసంగం మండలం చిలేమామిడి గ్రామానికి చెందిన లక్ష్మి(35)కి భర్త లేడు. ఆమె కొడుకు ఉండగా హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. ఉపాధి కోసం వచ్చిన ఆమె పస్తాపూర్‌లో అద్దె ఇంట్లో ఉంటుంది. ఆదివారం ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిలోపలికి చొరబడి ఆమెను చితకబాదారు. గ్యాస్ సిలిండర్‌తో తలపై కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె మెడలో ఉన్న బంగారం తీసుకుని పారిపోయారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ డీఎస్‌పీ రాంమోహన్‌రెడ్డి, సీఐ.శివలింగం ఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుల కోసం డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. మృతురాలి చెల్లెలు జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.