
మట్టి పరీక్ష.. పంటకు రక్ష
● భూసార పరీక్షలు చేయిస్తేనే అధిక దిగుబడి ● అవసరం మేరకు ఎరువులు వాడితేనే మేలు ● రైతులకు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు
చిన్నకోడూరు(సిద్దిపేట): పంటలు సాగు చేసే రైతులు మేలైన దిగుబడి సాధించాలంటే భూమి సారవంతంగా ఉండాలి. అయితే ఏ భూమిలో ఎంత మేరకు పోషకాలున్నాయనే విషయం భూసార పరీక్షలతోనే తేలిపోతుంది. భూములు ఖాళీగా ఉన్నందున భూసార పరీక్షలకు ఇదే సరైన సమయమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ మట్టి నమూనాల సేకరణ, పరీక్షల ఆవశ్యకతను వివరిస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మండలంలో 5,391 మట్టి నమూనాలు సేకరించినట్లు ఏఓ జయంత్ కుమార్ తెలిపారు.
2 నుంచి 3 ఏళ్లకోసారి చేయించాలి
నేలలో అనేక పోషకాలు ఉంటాయి. కానీ పంటల దిగుబడి కోసం వ్యాపారులపైనే ఆధారపడుతున్న పలువురు రైతులు అదనంగా సేంద్రియ, రసాయనిక ఎరువులను వాడుతున్నారు. తద్వారా సాగు ఖర్చు పెరగడమే కాక నేల తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది. ఇలా జరగొద్దంటే ప్రతీ రైతు 2 నుంచి 3 ఏళ్ల కోసారి భూసారాన్ని తెలుసుకోవాలి. తద్వారా అవసరమైన ఎరువులు వాడితే ఫలితం ఉంటుంది. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల భూమిలో మొక్కకు కావాల్సిన పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలిసిపోతుంది. సమస్యాత్మకమైన భూములు ఉంటే వాటిని సవరించుకునే విధానాలు తెలుసుకోవచ్చు.
ఫలితాల ఆధారంగా..
భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. భూసార పరీక్షల ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లోని ఉదజని, లవణ సూచిక పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాష్‌ల లభ్యతను తెలుసుకునే వీలు ఉంటుంది. దీని ద్వారా అవసరమైన మోతాదులో ఎరువుల వినియోగానికి అవకాశం ఉంటుంది. రైతులు భూమిని కాపాడుకునేందుకు మట్టి పరీక్షలు తప్పక చేయించుకోవాలని సూచిస్తున్నారు.
భూసార పరీక్షలతో మేలు..
భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. రైతులు తమ భూమిలో భూసార పరీక్షలను ప్రతీయేటా చేయించుకోవాలి. భూమికి కావాల్సిన పోషక విలువలు తెలసుకోవచ్చు. ఆపై అవసరమున్నంత ఎరువులను ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
– జయంత్ కుమార్, ఏఓ, చిన్నకోడూరు