
తక్కువ ధరకు బంగారం ఇస్తానంటూ మోసం
● పలువురు నుంచి రూ.90 లక్షలు వసూలు ● నిందితుడి రిమాండ్
సిద్దిపేటకమాన్: తక్కువ ధరకు బంగారం ఇస్తానంటూ పలువురు నుంచి డబ్బులు వసూలు చేసిని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన చేపూరి రవికుమార్ పట్టణంలో బంగారం షాపును నిర్వహిస్తున్నాడు. కొద్ది నెలలుగా షాపునకు వచ్చే కస్టమర్లను తక్కువ ధరకు బంగారం ఇస్తానంటూ నమ్మిస్తున్నాడు. సుమారు 25 మంది బాధితుల నుంచి రూ.90 లక్షల వరకు వసూలు చేశాడు. నెలలు గడుస్తున్నా డబ్బులు ఇచ్చిన వారికి రవి బంగారం ఇవ్వడం లేదు. పట్టణానికి చెందిన అంబడిపల్లి భాస్కర్ పలు విడతలుగా రూ.7 లక్షలు, జక్కుల కుంటయ్య నుంచి రూ.6.9 లక్షలు, వెంకటభాస్కరరావు నుంచి రూ.9 లక్షలు రవి తీసుకొని బంగారం, డబ్బులు ఇవ్వలేదని బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది కనకరాజు, అజయ్, స్వామి నిందితుడైన రవికుమార్‌ను పట్టణంలోని అతడి దుకాణం వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.