
చిన్నప్పటి నుంచే లక్ష్యం..
న్యాల్‌కల్(జహీరాబాద్): చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. మొదటి ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. అంతటితో ఆగకుండా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఎక్కెల్లి అఽఖిలజారెడ్డి గ్రూప్–1లో ప్రతిభ కన బర్చింది. మండల పరిధిలోని మిర్జాపూర్(బి) గ్రామానికి చెందిన ఎక్కెల్లి నిర్మల, జగనాథ్‌రెడ్డి దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. కూతురు అఖిలజారెడ్డి 10వ తరగతి వరకు పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివింది. తరువాత హైదరాబాద్‌లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. 2019లో మొదటి ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేస్తూ గ్రూప్స్‌కు ప్రిపేర్ అయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 పరీక్ష రాసి 483.5 మార్కులతో రాష్ట్రంలో 125 ర్యాంక్, మల్టీ జోన్‌లో 50వ ర్యాంక్ సాధించింది. ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉందని అఖిలజారెడ్డి పేర్కొంది. తన లక్ష్యం ఐఏఎస్ అని, ప్రజలకు సేవ చేయాలని ఆమె పేర్కొంది. ఉద్యోగానికి ఎంపిక కావడం పై ఆమె తల్లిండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో స్వీట్లు పంచి పెట్టారు.