
సన్న బియ్యం.. సంబురం
చరిత్రాత్మకం: మంత్రి పొన్నం
లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు
● మొదటిరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో 801 టన్నుల బియ్యం పంపిణీ
● 38వేలకుపైగా
కార్డుదారులకు అందజేత
● రేషన్ షాపుల వద్ద
లబ్ధిదారులు బారులు
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. రేషన్ కార్డు దారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ షాప్‌ల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 8,83,883 రేషన్ కార్డులుండగా మొదటి రోజు మంగళవారం 694 రేషన్ షాపులలో 38,526 కార్డుదారులకు 801.134 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. హుస్నాబాద్‌లో సన్నబియ్యం పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి పాల్గొన్నారు.
అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో మొదటి రోజు అత్యధికంగా రేషన్ కార్డుదారులు సన్న బియ్యం తీసుకున్నారు. అత్యల్పంగా మెదక్ జిల్లాలో పంపిణీ చేశారు. నార్సింగ్, టెక్మాల్, పాపన్నపేట మండలాల్లో రెండు రేషన్‌షాపుల చొప్పున 6 రేషన్ షాపులలో మాత్రమే బియ్యం పంపిణీ చేయడం గమనార్హం. మరి కొన్ని రేషన్ షాపులలో బియ్యం చేరుకోవాల్సి ఉంది. అలాగే కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులతో ప్రారంభిస్తామని పంపిణీని వాయిదా వేశారు.
కార్డుదారుల్లో సంతోషం..
కొన్నేళ్లుగా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేసింది. దీంతో కార్డుదారులు అంతంత మాత్రంగా తీసుకునేందుకు మొగ్గుచూపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా నిలవాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్న బియ్యాన్ని అందజేస్తోంది. కార్డుదారులు సంతోషంగా సన్న బియ్యం తీసుకున్నారు. సన్న బియ్యం ఇస్తుండటంతో బయట కొనడం ఇక తప్పిందని.. అలాగే డబ్బులు కూడా మిగులుతాయని కార్డు దారులు ఆనందం వ్యక్తం చేశారు.
హుస్నాబాద్: దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించడం చరిత్రాత్మకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో తెల్లరేషన్ కార్డులదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2.91 లక్షల రేషన్ కార్డులదారులకు సన్న బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఇంటికి చేరే ముందే వేరే వాళ్ళకు అమ్మడం, రేషన్ దుకాణాలకు వాపస్ ఇవ్వడం జరిగేదన్నారు. ఇక నుంచి సన్న బియ్యం అందరూ తీసుకుంటారన్నారు. అందరికీ ఆరోగ్యం బాగుండాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం సన్న బియ్యం పఽథకం ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.
మొదటి రోజు పంపిణీ వివరాలు
జిల్లా మండలాలు రేషన్ కార్డులు కిలోలు
షాపులు
మెదక్ 3 06 86 1,960
సిద్దిపేట 25 365 17,933 3,62,138
సంగారెడ్డి 27 323 20,502 4,37,036

సన్న బియ్యం.. సంబురం