
మహిళా సంఘాలకు గ్రేడింగ్
సంగారెడ్డిటౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహకార సంఘాలు మరింత అభివృద్ధి పథంలో పయనించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ పథకాలను ఆయా మహిళా సంఘాలకు అందజేస్తోంది. మహిళలకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా...స్వయం ఉపాధికి బాటలు వేస్తోంది. సంఘాల్లో సభ్యులు అనుభవమున్న రంగంలో రాణించేలా ప్రత్యేక రుణాలు మంజూరు చేస్తున్నారు. అందుకే మహిళా సంఘాలలో మరింతమంది సభ్యులుగా చేరేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకుతోపాటు శ్రీనిధి రుణాలు సైతం అందుతుండటంతో ఆర్థిక సమస్యలను అధిగమించే దిశగా మహిళా సంఘాల సభ్యులు ముందుకు సాగుతున్నారు. ఈ సంఘాలను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో గ్రేడింగ్ విధానాన్ని సైతం అమలు చేస్తోంది. మహిళలకు గ్రేడింగ్ పెరిగేకొద్దీ రుణాలను ఎక్కువగా ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి. మహిళా సంఘం సభ్యులు సమావేశాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా ఫొటోలను జతచేయాల్సి ఉంటుంది. ఏ గ్రేడ్ నుంచి సీ గ్రేడ్ వరకు పరిగణనలోకి తీసుకుంటారు. జిల్లాలో మొత్తం 1,95,235 మంది సభ్యులు ఉండగా, మహిళా సంఘాలు 18,208 అందులో 25 మండలాల్లోని 695 గ్రామాలలో గ్రామ సంఘాలలోని మహిళలున్నారు. వారికి గ్రేడ్‌ల ఆధారంగా రుణాలను అందిస్తున్నారు. మహిళా సంఘాలకు ఒక్కో యూనిట్ విలువను రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిర్ణయించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండల, గ్రామ స్థాయిలలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అంశాలవారీగా కేటాయింపు
మహిళా సంఘాలకు 12 అంశాల ఆధారంగా ఏ,బీ,సీ,డీ,ఈలతో గ్రేడింగ్ ఇస్తారు. ఒక్కో మహిళా సంఘం 75 శాతానికి పైగా గ్రేడింగ్‌ను సాధిస్తే ఎక్కువ సంఖ్యలో రుణాలిస్తారు. ఇలా తక్కువ వడ్డీకి ఇచ్చిన రుణాలను వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 75 శాతానికి పైగా లక్ష్యాలను సాధిస్తే ఏ గ్రేడ్, 70% నుంచి 74% బీ గ్రేడ్, 60 లోపు సాధిస్తే సీ గ్రేడ్, 50% కంటే తక్కువ ఉంటే డీ గ్రేట్, అంతకంటే తక్కువగా ఉంటే ఈ గ్రేడింగ్ ఇస్తారు. ఏ,బీ,సీ గ్రేడింగ్ సంఘాలకు శ్రీనిధి రుణాలను కేటాయిస్తారు. గ్రామైక్య సంఘాలకు మాత్రమే ఈ గ్రేడింగ్ విధానం అమలులో ఉంది. క్షేత్రస్థాయిలో స్వయం సహాయక సంఘాలకూ ఇదే నిబంధన వర్తించనుంది.
గ్రేడింగ్ విధానంతో రుణాలు పెరిగిన పర్యవేక్షణ రగ్రేడ్ పాయింట్ల ఆధార ంగా ప్రాధాన్యం
కేటాయించే పద్ధతులు...
ప్రతీ నెల రెండు సమావేశాలు ఉంటాయి
సమావేశానికి అందరూ హాజరు కావాలి
సక్రమంగా శ్రీనిధి రుణ వాయిదాల చెల్లింపుల పద్ధతిలో చేయాలి
ప్రతీనెల పొదుపు చెల్లింపులు ఉండాలి
గ్రామ సంఘానికి చెల్లించిన రుణ వాయిదాలు, బ్యాంకు రుణ వాయిదాల చెల్లింపులు సక్రమంగా ఉండాలి
వీటన్నింటికీ తగిన మార్కులను కలిపి గ్రేడింగ్ నిర్ణయిస్తారు
ఇందిరా మహిళా శక్తి శ్రీనిధి అమలు చేసిన కార్యక్రమాలలో 100% టార్గెట్‌ను గుమ్మడిదల సమైక్య సంఘం పూర్తి చేసింది
మిగతా మండలాలలో కూడా లక్ష్యాలను పూర్తిచేసే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మహిళా సంఘాల పర్యవేక్షణ పెరిగింది
మహిళా సంఘాలలో గ్రేడింగ్ విధానం అమలు చేయడంతో పొదుపు సంఘాలపై పర్యవేక్షణ పెరిగింది. సమావేశాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు లైవ్‌ఫొటోలను అప్‌లోడ్ తప్పనిసరిగా చేయాలి. ఎప్పటికప్పుడు అధికారులు సంఘాల వారీగా నివేదికలను తీసుకుని సమీక్ష చేస్తున్నారు.
– జంగారెడ్డి,
జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి.

మహిళా సంఘాలకు గ్రేడింగ్