
చికెన్ ధర దడ దడ
● వేసవి కారణంగా తగ్గిన కోళ్ల ఉత్పత్తి ● అధిక డిమాండ్‌తో ధరలు ౖపైపెకి ● తగ్గిన బర్డ్ ఫ్లూ భయం
జోగిపేట(అందోల్): చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్‌ఫ్లూ భయంతో సుమారు రెండు నెలల పాటు కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతోపాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది.
రెండు నెలలుగా భారీగా తగ్గిన అమ్మకాలు
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా రెండు నెలల క్రితం చికెన్ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. బర్డ్ ఫ్లూ భయంతో కొందరు రైతులు కోళ్ల పెంపకాన్నే తగ్గించేశారు. కేజీ చికెన్ రూ.150 నుంచి రూ.180 లే ఉన్నా కొనేవారు లేక పోవడంతో చికెన్ షాపులు వెలవెల బోయాయి.
కొనుగోలుకు ఆసక్తి
బర్డ్ ఫ్లూ భయం క్రమంగా తొలగిపోతోంది. దీంతో సాధారణ రోజుల్లాగే చాలామంది చికెన్ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చికెన్ డిమాండ్ పెరిగందన్న వాదన వినిపిస్తోంది. ఇదే అదనుగా చికెన్ దుకాణాల నిర్వాహకులు ఒక్కొక్కరూ ఒక్కో ధరకు అమ్ముతున్నారు. జోగిపేట పట్టణంలోని కొన్ని చోట్ల కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.250 ఉంటే.. మరికొన్ని చోట్ల రూ. 270, రూ.280 వరకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ఏరియాకో విధంగా రేట్లున్నాయి. ధర భారీగా పెరగడంతో కేజీ చికెన్ తీసుకుందామని వచ్చిన వారు..అర కేజీ, ముప్పావు కేజీకే పరిమితం అవుతున్నారు. చికెన్ సెంటర్ల నిర్వాహకులు మాత్రం కోళ్ల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతోనే ధరలు పెరిగాయని చెబుతున్నారు.
పౌల్ట్రీ రైతులకు దక్కని రేటు
చికెన్ ధరలు భారీ స్థాయిలో పెరిగినా పౌల్ట్రీ రైతులకు మాత్రం నష్టాలు తప్పడం లేదు. రెండు కిలోల కోడిని పెంచేందుకు 40 రోజుల సమయం పడుతుండగా..ఇందుకు రూ.200 వరకు ఖర్చు అవుతోంది. చికెన్ దుకాణాలకు కోళ్లను సరఫరా చేసే వ్యాపారులు మాత్రం కిలోకు రూ.80, రూ.100 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో ఏడాది పొడవునా నష్టాలు చవి చూడాల్సి వస్తోందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రేడర్లు, సెంటర్ల నిర్వాహకులు ఎవరి మార్జిన్ వారు చూసుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారని, రేటు తగ్గినప్పుడల్లా ఆ నష్టాన్ని తామే భరించాల్సి వస్తోందని వాపోతున్నారు.
రెండు నెలలు ఇబ్బంది పడ్డాం
బర్డ్‌ఫ్లూ సోకిందన్న ప్రచారంతో రెండు మాసాలుగా వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాం. ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో పాటు గిరాకీ లేక కోళ్లు చాలా వరకు చనిపోయాయి. అయినా నిలదొక్కుకున్నాం.
ఎండీ.జావీద్, చికెన్ సెంటర్ యజమాని

చికెన్ ధర దడ దడ