
భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త
పటాన్‌చెరు టౌన్: భార్య కాపురానికి రావడం లేదని ఆగ్రహించిన భర్త రోకలి బండతో కొట్టి చంపాడు. అడ్డొచ్చిన అత్త పై దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వినాయక రెడ్డి కథనం మేరకు.. జిన్నారం మండలం కిష్టాయిపల్లికి చెందిన సురేశ్‌కి పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామానికి చెందిన రమీలా(24)తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పాప ఉండగా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం సాయి కాలనీలో ఉంటున్నారు. సురేశ్ ఓ ప్రైవేటు వెంచర్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రమీలా పాపను తీసుకొని పెద్ద కంజర్లలోతల్లిగారింటికి వెళ్లింది. కాపురానికి రమ్మంటే రావడం లేదని సోమవారం అత్తగారింటికి వచ్చి భార్యతో సురేశ్ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కోపోద్రేకుడై రోకలి బండతో భార్యపై దాడి చేయగా తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డువచ్చిన అత్తపై దాడి చేయగా ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకొని ఎస్‌ఐ వెంకట్ రెడ్డితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించాం. మృతురాలి సోదరుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సురేశ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కాపురానికి రావడం లేదని ఘాతుకం
అడ్డొచ్చిన అత్తపై దాడి
పటాన్‌చెరు మండలంలో ఘటన