
భూభారతితో సులభతరం
కలెక్టర్ వల్లూరు క్రాంతి
పుల్‌కల్(అందోల్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతితో రైతులకు సంబంధించిన భూలావాదేవీలు సులభతరమవుతాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు. పుల్‌కల్‌లో శనివారం రైతువేదికలో ఏర్పాటుచేసిన భూ భారతి అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇతర రాష్ట్రాలలో పర్యటించి, మేధావుల, పలు రైతు సంఘాలతో చర్చించి ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిందన్నారు. గతంలోలాగా కాకుండా భూ భారతిలో భూసమస్యలు 30 రోజుల్లో పరిష్కారం అవుతాయని సూచించారు. అనంతరం కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసి 8,9 తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు,తహసీల్దార్ కృష్ణ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.దుర్గారెడ్డి, నాయకులు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.