
సంచారం లేని శౌచాలయం
సంగారెడ్డి: గత కొన్ని నెలలుగా పబ్లిక్ టాయిలెట్ బస్సు మూలన పడింది. సంగారెడ్డి పట్టణంలో వివిధ మార్కెట్లలో ప్రజల సౌకర్యార్థం ఉంచేందుకు లక్షల రూపాయలు వెచ్చించి మొబైల్ టాయిలెట్ బస్సును కొనుగోలు చేశారు. కొన్ని రోజులు వాడి చేతులు దులుపుకున్నారు. సంవత్సరం పాటుగా ఈ బస్సు పాత కలెక్టరేట్ కార్యాలయంలో ఓ మూలన పడి ఉంది. పట్టణంలో జరిగే సంతలలో పబ్లిక్ టాయిలెట్స్ లేక అక్కడికి వచ్చే వ్యాపారులు,కొనుగోలుదారులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నా అధికారుల్లో మాత్రం కదలిక లేదు. ఇప్పటికై నా పబ్లిక్ టాయిలెట్ బస్సును సంతలో ఉంచి తమ సమస్యలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజాధనం వృథా
ప్రజల అవసరాల కోసం లక్షలు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు తప్ప వాటిని ఉపయోగించడం లేదు. పన్నులు మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నారేగానీ వాటికి తగ్గ సౌకర్యాలు కల్పించడం లేదు.
– మల్లేశం, సంగారెడ్డి
ఈవెంట్స్ అయితేనే పెడుతున్నాం
పట్టణంలో ఏవైనా ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు అయితే మొబైల్ టాయిలెట్ బస్సు వాడుతున్నాం. మార్కెట్లలో పెట్టే సంగతి నాకు తెలియదు. ఇక పైనుంచి మొబైల్ టాయిలెట్లు అన్ని మార్కెట్లలో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటాం.
–ప్రసాద్ చౌహన్, మున్సిపల్ కమిషనర్
మా బాధలు ఎవరికి చెప్పాలి
ప్రతీ అంగడి రోజు ఉదయం 10 గంటలకు సంతలోకి వచ్చి రాత్రి 8 గంటల వరకు కూరగాయల అమ్ముకుంటున్నాను. శౌచాలయాలు లేక ఉదయం నుంచి రాత్రి వరకు మూత్రానికి కూడా పోవడం లేదు. అధికారులు గతంలో ఇక్కడ బస్సు ఉంచేవారు. ఇప్పుడు ఆ బస్సు కూడా లేకపోవడంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది.
– అంజమ్మ, కూరగాయల వ్యాపారి
ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
ప్రజాధనం వృథా

సంచారం లేని శౌచాలయం