
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
గజ్వేల్‌రూరల్: అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలోని దాచారంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన వల్లెపు యాదగిరికి 20 ఏళ్ల క్రితం నర్సమ్మ అనే మహిళతో వివాహం జరుగగా ఆమె మృతి చెందింది. దీంతో ఆరేళ్ల క్రితం కామారెడ్డి ప్రాంతానికి చెందిన శ్రీలతను రెండో వివాహం చేసుకోగా వీరికి రెండేళ్ల కూతురు ఉంది. అప్పుడప్పుడు దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 16న ఓ పరిశ్రమలో పనికోసం వెళ్లిన యాదగిరి రాత్రి ఇంటికి వచ్చే సరికి భార్య కనిపించలేదు. దీంతో పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దుస్తులు అమ్మడానికి వెళ్లిన యువకుడు
రామాయంపేట(మెదక్): దుస్తులు అమ్మడానికి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఎస్‌ఐ బాల్‌రాజ్ కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లోని ఖానాపూర్ జిల్లా అలపూర్ గ్రామానికి చెందిన బాబులు సింగ్ (23) నాలుగేళ్ల క్రితం రామాయంపేటకు వచ్చి దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. ఈనెల 18న ఉదయం దుస్తులు అమ్మడానికి బైక్‌పై బోడ్మట్‌పల్లి వైపు వెళ్లి తిరిగి రాలేదు. రెండు రోజులుగా అతడి ఆచూకీ లభించకపోవడంతో పాటు ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. అతడి బంధువులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.