
భూ సమస్యలకు పరిష్కారం
జహీరాబాద్/రాయికోడ్(అందోల్): భూ సమస్యలకు భూభారతితో సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. సోమవారం జహీరాబాద్, మొగుడంపల్లి, అలాగే.. రాయికోడ్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఆమె మాట్లాడారు. భూ సమస్యలు కలిగి ఉన్న రైతులు పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరిస్తామన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్ లేదా సీసీఎల్‌ఏకు అప్పీల్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉందన్నారు. భూ భారతి చట్టం ద్వారా ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారి, కలెక్టర్‌కు అధికారాలు కల్పించారని తెలిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీలు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూ భారతిలో కొనసాగుతాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం ఈ చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ప్రతి భూ కమతానికి భూదాన్ నంబరు కేటాయించనున్నట్లు తెలిపారు. భూ సరిహద్దు గొడవలు, ఫిర్యాదులు భూ భారతి చట్టం ద్వారా పరిష్కరించుకునే అవకాశం కలిగిందన్నారు. నూతన చట్టం ద్వారా ఇకపై ఫౌతి నెల రోజుల్లో పూర్తి అవుతుందని చెప్పారు. సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీఓ రాంరెడ్డి, ఏడీఏ భిక్షపతి, ఏఓ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా భూభారతి
నిర్ధిష్ట గడువులోగా మ్యుటేషన్
అవగాహన సదస్సులో కలెక్టర్ క్రాంతి
అర్హులనే ఎంపిక చేయాలి
రాయికోడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశమయ్యారు. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. నిరుపేదలు, వితంతువులు, భూమిలేని వారికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాయికోడ్‌లో జరిగిన సదస్సులో గ్రంథాలయాల సంస్థల చైర్మన్ అంజయ్య, మండల ప్రత్యేకాధికారి జగదీశ్వర్, ఏఎంసీ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ సిద్దప్ప పాటిల్, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీఓ షరీఫ్ తదితరలు పాల్గొన్నారు.