
విజయ తీరం వైపు..
కష్టాల కడలిలో...
కూతురు చదువు కోసం ఓ తల్లి ఆరాటం
ఏడడుగులు తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన పతిని విధి దూరం చేసింది. ఇంటి పెద్ద లేకపోవడంతో బాధ్యతలు భుజాన పడ్డాయి. పండుగొస్తే రెండు పూటలా భోజనం.. సాధారణ రోజుల్లో ఒక్క పూట తిండి గగనం.. మరోవైపు ఎదుగుతున్న ఆడపిల్లను చదివించడం ఒక పోరాటం.. ఆర్థిక పరిస్థితి బాగాలేక, అటు కన్నవారు, ఇటు కట్టుకున్న వారు ఆర్థికంగా లేక జానెడు పొట్ట కోసం బతుకు పోరాటం చేస్తున్న విజయ కష్టాల కడలిలో తీరం వైపు కదులుతుంది.. మనసున్న మహారాజులు చేయూత ఇస్తే నా కూతురు చదువుకు సాయం చేసిన వారు అవుతారని కోరారు.
– సిద్దిపేటజోన్
పెద్దపల్లి జిల్లాకు చెందిన విజయకు సిద్దిపేట జిల్లా ఆకారానికి చెందిన నాగరాజుతో 2011లో వివాహం జరిగింది. ఆర్థిక పరిస్థితులు అంతంతే ఉండటంతో నాగరాజు 10 ఏళ్ల క్రితం సిద్దిపేట పట్టణానికి బతుకు దెరువు కోసం వలసొచ్చాడు. స్థానికంగా ఓ ప్రైవేట్ ఏజెన్సీలో చిరు ఉద్యోగం సంపాదించి భార్య బిడ్డను పోషిస్తున్నాడు. సజావుగా సాగుతున్న వీరి జీవితం పై విధి పగ పట్టింది. 2020లో కరోనా వ్యాప్తి ప్రబలుతున్న సమయంలో బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయాడు. అక్కడి నుంచి విజయ కష్టాలు మొదలయ్యాయి కట్టుకున్న భర్త దూరం కావడంతో సిద్దిపేటలో జీవనం కష్టతరంగా మారడంతో మెట్టినిల్లు ఆకారం గ్రామానికి తిరిగి వెళ్లింది. రెండేళ్ల తర్వాత మళ్లీ సిద్దిపేటకు బతుకు దెరువు కోసం వచ్చింది. చదువు అంతంతే ఉండటంతో విజయకు ఉపాధి అవకాశాలు లభించలేదు. పట్టణంలోని పలు చోట్ల కిరాయి ఇంట్లో ఉంటూ కూతురిని చదివిస్తూ బతుకు పోరాటం చేస్తుంది.
మోటివేషన్‌లో కంటతడి
ఇటీవల వేలాది మంది విద్యార్థులకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు.. పిల్లల బాధ్యత గురించి మోటివేషన్ ప్రక్రియ నిర్వహించారు. వారి మోటివేషన్ విన్న సాత్విక తల్లీ విజయ తన కోసం పడుతున్న తపన గుర్తుకు తెచ్చుకొని కంటతడి పెట్టింది. ఇదే సభలో ఉన్న ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ఒక్కసారిగా కంటతడి పెట్టిన వైనం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
బాగా చదువుకోవాలి
అమ్మ నా చదువు కోసం పడుతున్న కష్టం చూస్తే ఏడుపు వస్తుంది. అమ్మ కష్టాలు శాశ్వతంగా తీరాలి అంటే నేను బాగా చదువుకోవాలి. పెద్ద అయ్యాక ప్రొఫెసర్ అవుతా.. కానీ ఇప్పుడు చదివేందుకు మా అమ్మ వద్ద డబ్బులు లేవు అంటూ అమాయకంగా తమ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పింది సాత్విక.
పిండి గిర్ని పడుతున్న విజయ
ఒంటరిగా బతుకు పోరాటం
ఒడిదుడుకుల జీవితం..
తీరని దుఃఖం
ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు
సిద్దిపేట జిల్లా ఆకారానికి చెందిన
విజయ కన్నీటి గాథ
పిండి గిర్ని జీవనాధారంగా..
స్థానికంగా ఎన్టీఆర్ నగర్ కాలనీలో రెండు గదుల కిరాయి ఇంట్లో ఉంటున్న విజయ జీవనాధారం పిండి గిర్ని మాత్రమే.. చిన్నపాటి రేకుల షెడ్‌లో గిర్ని పెట్టుకొని బతుకు దెరువు సాగిస్తోంది. సమీపంలో ఉన్న వారు తెచ్చిన వాటిని పిండిగా మార్చి వారిచ్చే కొద్దిపాటి డబ్బులతో బతుకు బండిని నడిపిస్తుంది. నెలవారీ ఖర్చు అధికంగా ఉండడం.. పిండి గిర్ని ద్వారా వచ్చే ఆదాయం అంతంతే కావడంతో ఆర్థిక పరిస్థితి బాగాలేక నిత్యం జీవితంతో పోరాటం చేస్తోంది.
కూతురు కోసమే..
భర్త దూరం అయ్యాడు... పుట్టినిల్లు. మెట్టినల్లు వారు ఆర్థికంగా లేరు. ఒక్కగానొక్క కూతురు చదువు కోసం కష్టపడాలి. తప్పదు. గిర్ని మీద వచ్చేది అంతంత మాత్రమే. రెక్కాడితే కానీ ఇల్లు, పిల్ల చదువు నడిచే పరిస్థితి. సాత్విక చాలా చురుకుగా ఉంటుంది చదువులో రాణిస్తుంది. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు.
– బోయ విజయ