
విధులు ఒక చోట... వేతనం మరోచోట
ఝరాసంగం(జహీరాబాద్): మండల పరిధిలో అధికారుల డివ్యూటేషన్‌ల వ్యవహారం గందరగోళంగా మారింది. విధులు ఒకచోట.. వేతనం మరోచోట తీసుకుంటున్నారు. తమకు అనువుగా ఉన్న చోట డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. పలు శాఖల్లో డిప్యూటేషన్‌పై వెళ్లడంతో ఇతర అధికారులపై పని భారం పడటమే కాకుండా.. కొన్ని శాఖల్లో సేవలు నిలిచిపోయాయి. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ,తో పాటు ఎంపీఓ, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్‌తోపాటు నలుగురు అటెండర్లు (ఆఫీస్ సబార్డినేట్లు) ఉండాలి. ఇక్కడ పేరుకు మాత్రం అన్ని పోస్టులు భర్తీ ఉన్నప్పటికీ కొందరు అధికారులు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఇక్కడ విధులు నిర్వహించాల్సిన సూపరింటెండెంట్ రాములు పుల్‌కల్ మండలంలో, టైపిస్ట్ వెంకటయ్య కొండాపూర్ మండలంలో, అటెండర్ (ఆఫీస్ సబార్డినేట్) పద్మావతి న్యాల్‌కల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో డిప్యూటేషన్‌పై వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి డిప్యూటేషన్‌పై సూపరింటెండెంట్‌గా వచ్చిన శంకర్ తిరిగి చౌటకూర్ ఎంపీడీఓ(ఎఫ్‌ఏసీ)గా వెళ్లారు. దీంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అధికారి సమయ పాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్ సేవలు అందించాలనే లక్ష్యంగా ప్రత్యేకంగా మెడికల్ అధికారి డా.గోపీని నియమించి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏర్పాటు చేశారు. కానీ, అధికారి మాత్రం మేడ్చల్ జిల్లా షామిర్‌పేటకు డిప్యూటేషన్‌పై వెళ్లాడు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇక్కడ విధులు నిర్వహించే జేఈ అధికారి అశోక్‌కుమార్ కోహీర్‌కు, అక్కడి నుంచి జేఈ ప్రతాప్‌రెడ్డి ఝరాసంగంకు డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పని చేసే అధికారిపై సమయపాలన పాటించకపోవటంతోపాటు నచ్చిన విధంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏపీయం బాలకృష్ణ జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి అక్కడి నుంచి ఝరాసంగంకు ఏపీఎంగా వి.టిక్యా డిప్యూటేషన్‌పై వచ్చారు. గతంలో వీఆర్‌ఏగా విధులు నిర్వహించిన బీరప్ప జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది కోహీర్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి, అక్కడి నుంచి తిరిగి ఝరాసంగం తహసీల్దార్ కారా్యాలయానికి డిప్యూటేషన్‌పై వచ్చారు. లైబ్రేరియన్ శ్రీనివాస్ సంగారెడ్డి గ్రంథాలయానికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో వారంలో కేవలం ఒక రోజు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. దీంతో పౌరసేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి.
ఝరాసంగంలో డిప్యూటేషన్‌ల దుమారం