
శిఖం.. ఖతం
● యథేచ్ఛగా చెరువు భూములు కబ్జా
● వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు
● అధికారుల పర్యవేక్షణ కరువు
బోరగుండు చెరువులో భూమిలో చేసిన సాగు
ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన బాధ్యతను అధికారులు తుంగలో తొక్కేస్తున్నారు. దీంతో అక్రమార్కులు దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు.
కొండపాక(గజ్వేల్): మండలంలోని చెరువు శిఖం భూములు కబ్జాకు గురవుతున్నాయి. కుకునూరుపల్లి మండలంలోని మేదినిపూర్ గ్రామ శివారులో ఎన్నో యేళ్ళ నాటి బోరగుండు కుంట సర్వే నంబరు 133లోని 1.27 ఎకరాల శిఖం భూమి కబ్జాకు గురవ్వడంతో చెరువు ఆనవాళ్లు లేకుండా పోయా యి. మిగతా చెరువులది కూడా ఇదే దుస్థితి.
ఇదీ చెరువుల పరిస్థితి..
పోసానికుంట, చింతల చెరువు భూములను కొంత వరకు కబ్జాచేసి వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటున్నారు. లకుడారం గ్రామంలోని ఇసుక చెరువు, బొబ్బాయిపల్లిలో ధర్మ చెరువు, కుకుకునూరుపల్లి శివారులోని కలకలమ్మ చెరువు భూములదీ అదే దుస్థితి. కలకలమ్మ శిఖం భూమి విస్తీర్ణం 143.9 ఎకరాలు. ఈ భూమి బొబ్బాయిపల్లికి ఆనుకొని ఉండటంతో చాలా మంది చాలా యేళ్లుగా ఇళ్లు నిర్మించుకొన్నారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే..
కొత్తపల్లి మనోహరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లేందుకు రైలు మార్గాన్ని కలకలమ్మ చెరువు భూమిలో నుంచే వేశారు. ఇది వరకు కబ్జాచేసి ఇళ్ల నిర్మాణాలు చేయగా మిగిలిన చెరువు శిఖం భూమిని కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇదంతా రెవెన్యూ అధికారుల మామూళ్ల మత్తులో జరుగుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. చెరువు శిఖం భూమిలో చేపడుతున్న నిర్మాణాలను రెండు నెలల కిందట రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు సజావుగా సాగాలంటే అధికారులకు ముడుపులు చెల్లించాలని కొందరు నాయకులు డబ్బులు వసూళ్లకు పాల్పడినట్టు ప్రచారం సాగింది. దీంతో మళ్లీ ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయన్న విమర్శలు ఉన్నాయి.
నిర్లక్ష్యం వహిస్తే కూల్చివేస్తాం
ఈ విషయమై తహసీల్దార్ సుజాతను వివరణ కోరగా అక్కడక్కడా చెరువు శిఖం భూములు కబ్జాకు గురయ్యాయన్న మాట వాస్తవమేనన్నారు. అక్రమ నిర్మాణాలు జరుగకుండా చూస్తామని, జరిగిన చోట ఎంక్వయిరీ రిపోర్టు ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించామన్నారు. ఖాతరు చేయకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని హెచ్చరించారు.

శిఖం.. ఖతం
Comments
Please login to add a commentAdd a comment