
సత్వర న్యాయం అందాలి
● శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ● మంత్రి పొన్నం ప్రభాకర్ ● హుస్నాబాద్‌లో ఏసీపీ కార్యాలయ భవనం ప్రారంభం
హుస్నాబాద్: పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన బాధితులకు సత్వర న్యాయం అందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో రూ.2.84 కోట్ల వ్యయంతో ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయ భవనాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం అందించడానికి పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలో ఫ్రెండ్లీ పోలీస్ ఒకటని, నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించి బాఽధితులకు న్యాయం చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు. పోలీసులు నూతన టెక్నాలజీని ఉపయోగించి విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత సేవలు అందించాలన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రమేశ్, కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు సతీష్, మధు, పురుషోత్తం రెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు, సీఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment