
మల్లన్న ఎనిమిదో వారం ఆదాయం రూ.58.39 లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో ఆదివారం రూ.58,39,513 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. మొత్తం మూడు రోజులలో ఈ ఆదాయం సమకూరిందన్నారు. భక్తుల వివిధ రకాల మొక్కులు, దర్శనాలు, లడ్డూ ప్రసాదం, పట్నాలు, బోనాలు, టికెట్ల అమ్మకాల ద్వారా ఈ ఆదాయం వచ్చిందని తెలిపారు. గత ఏడా ది కంటే ఈసారి రూ.11,52,263 అధికంగా వచ్చిందని ఈఓ రామాంజనేయులు తెలిపారు.
దుబ్బాక మున్సిపల్ బడ్జెట్ రూ.22.22 కోట్లు
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
సమక్షంలో ఆమోదం
దుబ్బాక: మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.22.22 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించినట్లు కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి గరిమా అగర్వాల్ సమక్షంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సాధారణ నిధులు, వివిధ గ్రాంట్లు కలుపుకొని ఆదాయం రూ.22.22 కోట్లుగా అంచనా కాగా, వ్యయం రూ.22.19 కోట్లుగా కేటాయించామన్నారు. ఆదాయం, వ్యయానికి సంబంధించి మొత్తంగా మిగులు బడ్జెట్ రూ.2.82 లక్షలు ఉందన్నారు. మున్సిపల్ సాధారణ ఆదాయం రూ.5.85 కోట్లు, వ్యయం రూ.5.82 కోట్లు ఉందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు రూ.80 లక్షలు, సిబ్బంది వేతనాలకు రూ.1.6 కోట్లు, విద్యుత్ చార్జీలకు రూ.62.5 లక్షలు అలాగే రుణాల చెల్లింపులకు రూ.40 లక్షలు కేటాయించామన్నారు.
వర్గల్ ఎంపీడీఓ బదిలీ
వర్గల్(గజ్వేల్): మండల పరిషత్ అధికారి విజయలక్ష్మి బదిలీ అయ్యారు. మంగళవారం ఎంపీఓ ఖలీమ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. యేడాదిపాటు సేవలందించి అందరి మన్ననలు పొందిన విజయలక్ష్మి, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ ద్వారా సొంత జిల్లా మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ఆదర్శలో ప్రవేశానికి
గడువు పెంపు
చిన్నకోడూరు(సిద్దిపేట): ఆదర్శ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల 20వరకు పొడిగించినట్లు ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సతీష్ తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులతో పాటు 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాలలో సంప్రదించాలన్నారు.
గ్రూప్ 2లో 103వ ర్యాంక్
హుస్నాబాద్: పట్టణానికి చెందిన అయిలేని మణికంఠేశ్వర్‌రెడ్డి గ్రూప్ –2లో 103 ర్యాంక్ సాధించారు. గ్రూప్ 2 పరీక్షలో 392.5 మార్కులు వచ్చాయి. గతంలో గ్రూప్ –4లో 600 ర్యాంక్ సాధించిన మణికంఠేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఎండోమెంట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

మల్లన్న ఎనిమిదో వారం ఆదాయం రూ.58.39 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment