
కోళ్లకు ఏమైంది..?
● అంతుచిక్కని వ్యాధితో వేలాదిగా మృత్యువాత ● తాజాగా మజీద్‌పల్లిలో 15 వేల కోళ్లు మృతి ● ఫారాలన్నీ ఖాళీ.. పౌల్ట్రీ రైతుల గగ్గోలు ● వివరాలు సేకరించిన పశువైద్యాధికారి
వర్గల్(గజ్వేల్): అంతుచిక్కని వ్యాధితో జిల్లా వ్యాప్తంగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్లతో కళకళలాడే పౌల్ట్రీ ఫారాలన్నీ వెలవెలపోతున్నాయి. తీవ్ర నష్టాలతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా వర్గల్ మండలం మజీద్‌పల్లిలోని రెండు పౌల్ట్రీఫారాలలో 15వేలపై చిలుకు కోళ్లు మృత్యువాత పడ్డాయి. మజీద్‌పల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే అలీ కోళ్లఫారం లీజుకు తీసుకుని అందులో 10వేల కోడి పిల్లలు పెంచుతున్నాడు. అదే విధంగా సయ్యద్ బాసిత్ తన సొంత ఫారంలో 7,500 కోళ్లు వేశాడు. ఈ ఫారాలలో కోళ్లను అంతుచిక్కని వ్యాధి చుట్టుముట్టింది. వ్యాధి బారినపడి ఈ రెండు ఫారాలలో వారం రోజులుగా కుప్పలకొద్ది కోళ్లు చనిపోయాయి. కోళ్లు చనిపోయి ఫారాలు ఖాళీ అవుతుండడంతో నష్టాలు చవిచూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిస్తా
వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడిన సమాచారం తెలిసి మంగళవారం వర్గల్ మండలం వేలూరు పశువైద్యాధికారి డాక్టర్ ఎన్ సర్వోత్తమ్ మజీద్‌పల్లి సందర్శించారు. బాధిత పౌల్ట్రీరైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎస్‌కే అలీ ఫారంలో 8,000 కోళ్లు, సయ్యద్ బాసిత్ ఫారంలో 7,000 కోళ్లు మృతిచెందినట్లు పేర్కొన్నారు. కోళ్లు మృతిచెందిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన పేర్కొన్నారు.
నష్టాలే మిగిలాయి
కోళ్లఫారం లీజుకు తీసుకుని 10 వేల కోడి పిల్లలు వేశాను. చక్కగా ఎదిగి రూ.లక్షకు పైగా ఆదాయం వస్తదనుకున్నా. అనూహ్యంగా వారం రోజుల నుంచి వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఇప్పటికే 8,500 కోళ్లు చనిపోయాయి. మిగతావి బతికే అవకాశం లేదు. రూ.1.20 లక్షల దాకా నష్టం. ప్రభుత్వం ఆదుకోవాలి.
– ఎస్‌కే అలీ, పౌల్ట్రీ నిర్వాహకుడు

కోళ్లకు ఏమైంది..?

కోళ్లకు ఏమైంది..?
Comments
Please login to add a commentAdd a comment