నాడు సరే.. నేడు ససేమిరా
బ్యాంక్ గ్యారంటీకి మిల్లర్లు వెనుకంజ
● సీఎంఆర్ ఆలస్యమయ్యే అవకాశం ● అక్రమాలకు చెక్ పెట్టేందుకే ‘గ్యారంటీ’ అంటున్న ప్రభుత్వం ● 129 మిల్లులకు 2.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయింపు ● ఇప్పటి వరకు గ్యారంటీ ఇచ్చింది 10 మిల్లులే
వారం రోజుల్లో అందజేయాలి
కేటాయించిన ధాన్యంలో మిల్లర్లు 10 శాతం బ్యాంక్ గ్యారంటీ అందజేయాలని ముందే చెప్పాం. వారం రోజుల్లో మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలను అందజేయకపోతే వారిపై ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
–ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్
బ్యాంక్ గ్యారంటీకి మొదట్లో సరే అన్న రైస్ మిల్లర్లు.. ఇప్పుడు ససేమిరా అంటున్నాయి. అక్రమాలకు చెక్ పెట్టేందుకు, మరోవైపు సీఎంఆర్ ఆలస్యం చేస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. వానాకాలంసీజన్‌లో 417 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.51లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. వాటిని 129 రైస్ మిల్లులకు కేటాయించారు. గతేడాది నవంబర్ 15 వరకే ధాన్యానికి 10శాతం బ్యాంక్ గ్యారంటీ ఇస్తామన్న మిల్లర్లు నేటి వరకు అందించకపోవడంతో సీఎంఆర్ ఆలస్యం జరిగే అవకాశం ఉంది.
సాక్షి, సిద్దిపేట: నిర్దేశించిన సమయంలో సీఎంఆర్ ఇవ్వకపోవడం, ధాన్యం మాయం కావడం వంటివి రాష్ట్ర వ్యాప్తంగా పలు మార్లు జరిగాయి. దీంతో ప్రభుత్వం మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలని నిర్ణయించింది. గతంలో హుస్నాబాద్ ఏఆర్‌ఎం ఆగ్రో ఇండ్రస్టీస్ మిల్లులో రూ.27.76 కోట్ల విలువ చేసే 9,522 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆక్రమంగా మిల్లు యజమాని విక్రయించారని తేలింది. ఇలా జరిగినప్పుడు ధాన్యం రికవరీ కష్టంగా మారింది. బకాయిల్లేని మిల్లర్లు.. కేటాయించిన ధాన్యంలో 10శాతం, బకాయిపడి తీర్చని వారు 20శాతం, బకాయి తీర్చి పెనాల్టీ చెల్లించని వారు 25శాతం బ్యాంక్ గ్యారంటీ చెల్లించాలని నిర్ణయించారు.129 మిల్లులకు 10 మిల్లులే బ్యాంక్ గ్యారంటీ అందించాయి. మరో 47 మిల్లులకు సంబంధించి ప్రాసెస్‌లో ఉన్నాయి. మిగతా 72 మిల్లుల వారు ఇప్పటికీ బ్యాంక్‌లో ప్రాసెస్ సైతం ప్రారంభించలేదు.
బ్యాంకర్లతో సమావేశాలు
రైస్ మిల్లులకు బ్యాంక్ గ్యారంటీలు త్వరగా అందించాలని అదనపు కలెక్టర్ సమావేశం సైతం నిర్వహించారు. డాక్యుమెంట్లు అందజేస్తే బ్యాంక్ గ్యారంటీలు అందజేస్తామని చెప్పారు. బ్యాంక్ గ్యారంటీల కోసం మిల్లర్లు బ్యాంకులకు వెళ్లలేదని తెలుస్తోంది. 20 రోజుల సమయం కావాలని పలువురు మిల్లు యజమానులు గతంలో అండర్ టేకింగ్ రాసి ఇచ్చారు. మూడు నెలలు దాటినా గ్యారంటీలను అందించలేదు. ధాన్యం కేటాయించే సమయంలో గ్యారంటీలను అందజేస్తామని చెప్పి ఇప్పుడు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఇవ్వని మిల్లర్ల పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మిల్లులను డీఫాల్ట్‌లో పెడతారా? లేదా కేటాయించిన ధాన్యాన్ని వెనక్కి తీసుకుంటారా? అనేది వేచిచూడాలి.
నాడు సరే.. నేడు ససేమిరా
Comments
Please login to add a commentAdd a comment