ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ జియో ట్యాగింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించడానికి ఏసీపీలు ముగ్గురు, సీఐలు పదిమంది, ఎస్‌ఐలు 27మంది, ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుళ్లు 67, కానిస్టేబుళ్లు 312 మందితో మొత్తం 419మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా అధికారుల సమన్వయంతో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ముందస్తు అడ్మిషన్లను నివారించాలి
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జనార్దన్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కార్పొరేట్ కళాశాలల్లో ముందస్తు అడ్మిషన్లను నివారించాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జనార్దన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు కార్పొరేట్ కళాశాలల్లో ముందస్తు అడ్మిషన్లు చేపడితే నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా గ్రామాలలో కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రచారం నిర్వహిస్తున్నాయన్నారు. ముందస్తు అడ్మిషన్లకు యత్నిస్తున్న కార్పొరేట్ కళాశాలల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలన్నారు. నిర్భంద విద్యతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సంగెం మధు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసన్న కుమార్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సత్కారం
దుబ్బాకరూరల్: ఇటీవల చండీగఢ్‌లో జాతీయ స్థాయి 400 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. మండలంలోని రామక్కపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నర్సింహులు పోటీల్లో పాల్గొని మన రాష్ట్రం నుంచి అవార్డు సాధించారు. దీంతో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నర్సింలును శాలువతో సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు.
ప్రేమ జంటపై దాడికి యత్నం
అడ్డుకున్న పోలీసులు
చేర్యాల(సిద్దిపేట): ప్రేమ జంటపై అమ్మాయి తరుపువారు దాడికి యత్నించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయి, అబ్బాయి ఇద్దరు మేజర్లు ప్రేమించుకున్నారు. ఆదివారం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఇద్దరు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన అమ్మాయి తరుపు బంధువులు కొందరు వారిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
రాష్ట్రస్థాయి పోటీలకు సిద్దిపేట ప్రాజెక్టు
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో పరిశోధన చేస్తున్న వరకవి సిద్ధప్ప ప్రాజెక్టు రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత సోమవారం తెలిపారు. తెలుగు విభాగాధిపతి డాక్టర్ మట్టా సంపత్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థులు సిద్ధప్ప రచనలపై తాత్విక భజనమండళ్ల సేవ అనే ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు. భజనమండళ్లతో ఆధ్యాత్మిక, నైతిక విలువలు, సంఘ సంస్కరణలపై సిద్ధప్ప చేసిన కృషి వర్తమాన సమాజానికి ఏవిధంగా ఉపయోగపడుందనే అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నట్లు తెలిపారు. తెలుగు విభాగాధిపతి, విద్యార్థులను ఆమె అభినందించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
Comments
Please login to add a commentAdd a comment