బాలలతో పని చేయిస్తే చర్యలు
● కార్మిక చట్టాల ప్రకారం నడుచుకోవాలి ● అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు ● మిట్టపల్లిలో పౌల్ట్రీఫాంలను తనిఖీ చేసిన అధికారులు
సిద్దిపేటఅర్బన్: బాలలతో పనిచేయించినా.. పనిలో పెట్టుకున్నా కఠిన చర్యలు తప్పవని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. కార్మిక చట్టాలకు లోబడి కార్మికులను నియమించుకోవాలన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని పలు పౌల్ట్రీ ఫాంలను వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సిద్దిపేట పరిసర ప్రాంతంలోని పౌల్ట్రీ వ్యాపారస్తులు వివిధ రాష్ట్రాల నుంచి లేబర్‌ను తీసుకువచ్చి పనులు చేయిస్తున్నారని తెలిపారు. వారికి ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ ఉండడం లేదన్నారు. పౌల్ట్రీ ఫాంలో బాలలను గుర్తించి యజమానులపై గతంలో కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని మండిపడ్డారు. లేబర్ పనిచేసే చోట చదువుకునే వయస్సు పిల్లలు అధికంగా ఉంటే వారికి అక్కడే పాఠశాల ఏర్పాటు చేసి ఉపాధ్యాయుడిని నియమిస్తామన్నారు. సంబంధిత పౌల్ట్రీ యజమాని అందుబాటులో లేకపోగా ఉన్న సూపర్‌వైజర్ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట పరిధిలోని అన్ని పౌల్ట్రీ ఫాంలలో ఆకస్మిక తనిఖీ చేస్తామన్నారు. చైల్డ్ లేబర్ ఉన్నా.. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపార సంస్థలలో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన లేబర్ కు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ సరిగ్గా ఉండాలని సూచించారు. వేతన చట్టాల ప్రకారం కార్మికులకు సరైన జీతాలు చెల్లించాలని యాజమాన్యానికి సూచించారు.
అధికారులు వస్తున్నారని.. పిల్లలను దాచి..
పౌల్ట్రీ ఫాంలను తనిఖీ చేయడానికి అధికారులు వస్తున్నారని తెలుసుకున్న యాజమాన్యం పిల్లలను దాచిపెట్టే ప్రయత్నం చేసింది. అక్కడికి చేరుకున్న అధికారులకు ఒక్క పిల్లవాడు కూడా కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. కాసేపు అక్కడే ఉండి పోలీసుల సహకారంతో అక్కడ ఉన్న గదులలో వెతకగా పిల్లలను దాచిపెట్టినట్టు గుర్తించారు. ఇటువంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతూ పిల్లలను దాచిపెట్టి మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వారం రోజులలో నిబంధనల ప్రకారం వలస కార్మికుల కోసం లైసెన్స్ తీసుకోవాలని, సైట్ స్కూల్ ఏర్పాటు చేయాలని సూచించారు. లేని పక్షంలో కార్మికులను వారి వారి స్వస్థలాలకు పంపించి యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎల్‌ఓ వికార్ బాబా, బాలల సంరక్షణ సిబ్బంది రేష్మ, రమేష్, ఆర్‌ఐ నర్సింహులు, పంచాయతీ కార్యదర్శి విజయ్, పోలీస్ సిబ్బంది కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment