
ప్రలోభాలకు ఎర
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
● పట్టభద్రుల స్థానానికి 56 మంది..
ఉపాధ్యాయకు 15 మంది పోటీ
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు
● జిల్లాలో 32 వేల మంది పట్టభద్రులు
సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాగింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసన మండలి స్థానాల ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండటంతో ఓటర్ల ప్రలోభాలకు తెరలేపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 15 మంది, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది బరిలో ఉన్నారు.
సాక్షి, సిద్దిపేట: జిల్లా వ్యాప్తంగా 32,589 మంది పట్టభద్రులు, 3,212 మంది ఉపాధ్యాయ ఓటర్లున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్‌టీయూ మద్దతుతో వంగ మహేందర్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ పోటీ పడుతున్నారు. బీసీ నినాదాన్నే నమ్ముకుని ప్రసన్న హరికృష్ణ ప్రచారంలో ముందుకు సాగారు.
సోషల్ మీడియాలో హోరెత్తిన ప్రచారం
నాలుగు ఉమ్మడి జిల్లాలు 42 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. సోషల్ మీడియానే ఎక్కువగా అభ్యర్థులు ఎంచుకున్నారు. వాట్సప్ గ్రూప్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా తమ గళంను వినిపించారు. తమకు ఓటేస్తే నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలపై తాము చేసిన ఉద్యమాలతో పాటు విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై తమ వైఖరిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
గెలుపే లక్ష్యంగా పార్టీలు
ఈ ఎన్నికల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆయా నియోజకవర్గాల వారీగా వివిధ జిల్లాలకు చెందిన నాయకులను ఇన్‌చార్జిలు గా నియమించారు. వీరు ఉదయం నుంచి రాత్రి వరకు పలువురు ఓటర్లను కలుస్తూ తమ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. అలాగే జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావులు వారి వారి అభ్యర్థులకు మద్దతుగా సమావేశాలు నిర్వహించారు.
ఉపాధ్యాయ ఓటర్లను కలుస్తూ..
ఉపాధ్యాయుల సమ్మేళనాలు, సమావేశాలతో పాటు నేరుగా ఓటర్లతో అనుసంధానంమవుతూ తమకు ఓటేయాల్సిన అవశ్యకతను వివరించారు. ఉపాధ్యాయ సంఘాలతో.. సమావేశాలతో ఓటర్ల్లను అభ్యర్థిస్తూ మరో వైపు రాత్రి వేళ డిన్నర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా పార్టీలు, సంఘాలు 25 నుంచి 50 ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించారు. పలువురు ఓటర్లు ఒక టీంగా ఏర్పడి వివిధ పార్టీల తరుపున బరిలో ఉన్న అభ్యర్థులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొందరు స్థానిక లీడర్ల ద్వారా చర్చలు జరుపుతున్నారు. పోలింగ్‌కు ఒక్క రోజే ఉండటంతో అభ్యర్థులు పంపకాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఓటర్లకు ఒక్కొక్కరికి దాదాపు రూ2వేల వరకు, ఉపాధ్యాయ ఓటర్లకు దాదాపు 5వేల వరకు ఇచ్చి తమవైపునకు తిప్పుకునే అవకాశం కనిపిస్తోంది.
163 బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ అమలు
పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల చుట్టూ163 బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ అమలు చేస్తున్నారు. పార్టీ జెండాలు, ప్ల కార్డులు ప్రదర్శించవద్దని, ఊరేగింపులు చేయవద్దని పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అన్ని పార్టీలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment