
వనం.. అంతాజనం
● ఏడుపాయల జాతర ప్రారంభం
● దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన
మంత్రి దామోదర
● ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ
పాపన్నపేట(మెదక్): మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏడుపాయల జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేద బ్రాహ్మణులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంజీర నదిలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు ఉచిత సేవలు అందిస్తున్న ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు.
ఇబ్బందులు తలెత్తొద్దు
ఏడుపాయల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన వన దుర్గమ్మను దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్యంపె ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గురువారం బండ్లు తిరిగే కార్యక్రమం ఉన్నందున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, వారికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ సైతం దుర్గమ్మను దర్శించుకొని పూజలు చేశారు. జాతరలో ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.
నిలిచిన నీటి సరఫరా
జాతరలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాత్‌రూంలలో నీరు లేకపోవడంతో నిర్వాహకులు వాటికి తాళాలు వేశారు. తాగునీటి కోసం అవస్థలు తప్పలేదు. తర్వాత అధికారులు పొడిచన్ పల్లి తాగునీటి పథకం నుంచి నీటి సరఫరాను పునరుద్ధరించారు. మంజీరనదిలో షవర్ బాత్‌ల కింద వేలాది మంది భక్తులు స్నానాలు చేశారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకున్నారు.

వనం.. అంతాజనం
Comments
Please login to add a commentAdd a comment