మల్లన్న పట్నం.. పోటెత్తిన జనం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న క్షేత్రంలో పెద్దపట్నం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివ రాత్రి పర్వదినం పురస్కరించుకుని తోటబావి వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు పెద్ద పట్నం వేడుకలు కనులపండువగా జరిగాయి. అదే సమయంలో గర్భగుడిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ రామాంజనేయులు, ధర్మకర్తలు, అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. పెద్దపట్నం నిర్వహించే తోట బావి ప్రాంగణానికి చేర్చారు. వేడుకలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.
41 వరుసలతో పెద్దపట్నం
బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన పెద్ద పట్నాన్ని 41 వరుసలతో వేశారు. ఇందుకు సుమారు 150 మంది ఒగ్గుపూజారులు పొల్గొన్నారు. ఊరేగింపుగా బోనాలు తీసుకువచ్చి పట్నంపై పెట్టి స్వామికి నైవేద్యం సమర్పించారు. అర్చకులు యాదవ సంప్రదాయం ప్రకారం స్వామివారి కల్యాణం నిర్వహించారు. వెంటనే ఉత్సవ విగ్రహాలతో పట్నం దాటారు. స్వామి వారి పట్నంను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో తోటబావి ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
బండారిమయమైన కొమురవెల్లి
శిమనామస్మరణతో మారుమోగిన తోటబావి ప్రాంగణం
Comments
Please login to add a commentAdd a comment