నీరు విడుదలకు నోచుకోక ఎండుతున్న పంటలు
తసాస్‌పల్లి రిజర్వాయర్‌లో తగ్గుతున్న నీటి నిల్వలు
తపాస్‌పల్లి రిజర్వాయర్‌లో నీరు లేక వెలవెలబోతోంది. సిద్దిపేట, జనగామ జిల్లాలకు ఆధారమైన ఈ రిజర్వాయర్‌కు 82,542 ఎకరాల ఆయకట్టు ఉండగా, 330ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్లు)నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. కానీ ప్రస్తుతం 95ఎంసీఎఫ్‌టీ మాత్రమే నీరు నిల్వ ఉంది. నీరు లేని కారణంగా ప్రస్తుత యాసంగిలో సాగునీరు విడుదల చేయడంలేదు. ఫలితంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. శుక్రవారం క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ పరిశీలించగా ఎన్నో విషయాలు వెలుగుచూశాయి.
గజ్వేల్/కొండపాక....●
కొమురవెల్లి మండలంలో ఉన్న తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ల్లో భాగంగా నిర్మించారు. సుమారు 300కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరునాగారం సమీపంలోని సమ్మక్క బ్యారేజీ నుంచి ఇక్కడికి సాగునీరు వస్తుంది. ఈ క్రమంలో చివరగా జనగామ జిల్లా బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి ఇక్కడికి నీళ్లు వస్తాయి. రిజర్వాయర్ నీటి సామర్థ్యం 330 ఎంసీఎఫ్‌టీ అంటే 0.33టీఎంసీలు. ఆయకట్టు 82,542 ఎకరాలకుపైనే. ఈ జలాశయం సిద్దిపేట, జనగామ జిల్లాలకు ప్రధాన ఆధారం.
ఎడమ కాల్వ ద్వారా..
రిజర్వాయర్ ఎడమ కాల్వ ఆధారంగా జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, కొండపాక, మద్దూరు మండలాలకు సాగునీరు అందుతున్నది. కుడి కాల్వ ద్వారా కొమురవెల్లి, చేర్యాలతోపాటు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలాలకు సాగునీరు అందుతుంది. ఎడమ కాల్వ పరిధిలో 4 డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, కుడి కాల్వ పరిధిలో మరో 8 డిస్ట్రిబ్యూటరీ కాల్వలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం రిజర్వాయర్‌లో కేవలం 95ఎంసీఎఫ్‌టీ మాత్రమే నీరు ఉంది. ఫలితంగా చాలా రోజులుగా ఈ రిజర్వాయర్ నుంచి కాల్వలకు సాగునీటిని వదలకపోవడంతో వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ కాల్వల ద్వారా వచ్చే నీటితో నింపాల్సిన ఆయా జిల్లాల్లోని వందలాది చెరువుల, కుంటలు వెలవెలబోతున్నాయి. ఎడమ కాల్వ కొండపాక, దమ్మక్కపల్లి, సిరిసినగండ్ల, మర్పడగ, ఖమ్మంపల్లి, తిమ్మారెడ్డిపల్లి, గిరాయిపల్లి, జప్తినాచారం, దుద్దెడ గ్రామాల గుండా 30కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నది. చాలా రోజులుగా ఈ కాల్వ గుండా సాగునీటి విడుదల లేక, కాల్వ పూర్తిగా వట్టివోయింది. అంతేకాకుండా ఈ కాల్వ ఆధారంగా నీటిని నింపే అవకాశమున్న 33 చెరువులు, కుంటలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ఒక్క కొండపాక మండలంలోనే ఈ కాల్వ ఆధారంగా 15,542ఎకరాల ఆయకట్టు ఉన్నది. కానీ చాలా రోజులుగా సాగునీరు విడుదలకు నోచుకోక వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఆందోళనలో రైతులు..
ఎండిన వరి చేను.. పశువులకు మేతగా
చేర్యాల(సిద్దిపేట): ఎండిన వరి చేను పశువుల మేతగా మారింది. పట్టణ కేంద్రానికి చెందిన ఖాత ఆంజనేయులు 2 ఎకరాల్లో వరి పొలం వేశారు. చేనుకు సరిపడా నీరు అందక ఎండిపోయింది. ఎండిన వరి చేనులో పశువులను మేపుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరుబావి నుంచి నీరురాక పంట చేను ఎండిపోయిందని వాపోయాడు.
రిజర్వాయర్‌లో భారీగా తగ్గిన నీరు
82,542 ఎకరాల ఆయకట్టు
రెండు ప్రధాన కాల్వలు, మరో 12డిస్ట్రిబ్యూటరీ కాల్వలు
సిద్దిపేట, జనగామ జిల్లాలకు ఆధారం
‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన
ఈ సందర్భంగా రైతులను పలకరిస్తే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ నీటిపై ఆధారపడి వరి సాగు చేస్తే.. నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. మరోవైపు భూగర్భజలమట్టం సైతం గణనీయంగా పడిపోయిందని ఆందోళన చెందుతున్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి నీరు వచ్చినా కొండపాక కాల్వకు సక్రమంగా నీటిని వదలడం లేదని చెబుతున్నారు. రిజర్వాయర్‌లో నీళ్లు ఉండే విధంగా చూస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నదని రైతులు చెబుతున్నారు.
నీరు విడుదలకు నోచుకోక ఎండుతున్న పంటలు
నీరు విడుదలకు నోచుకోక ఎండుతున్న పంటలు
Comments
Please login to add a commentAdd a comment