టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి
● కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం
● అధికారులకు దిశానిర్దేశం
సిద్దిపేటరూరల్: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి తెలిపారు. శుక్రవారం కలెక్టరెట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే టెన్త్ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 79 పరీక్షా కేంద్రాల్లో 14,138 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇందుకు చీఫ్ సూపరింటెండెంట్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి నిఘా పెట్టాలన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ముందుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రానికి చేరుకునేలా అవసరమైన మార్గాల్లో బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులు చూడాలన్నారు. పరీక్షా సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుని, మౌలిక వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, ఆర్డీఓలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు క్లియర్ చేయండి
సిద్దిపేటరూరల్: పెండింగ్ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పరిశీలించి మార్చిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎల్‌ఆర్‌ఎస్‌పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డీఓలు, డీపీఓ, డీటీసీపీఓ, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment