
అధ్యాపకులూ నిత్య విద్యార్థులే
● పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన ● ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ మదన్‌మోహన్
సిద్దిపేటఎడ్యుకేషన్: ఉపాధ్యాయులు, అధ్యాప కులు, ఆచార్యులు కేవలం విద్యార్థులకు విద్యను అందించడంతోనే సరిపెట్టుకోకూడదు. వారికి నిత్యం ఉత్సాహాన్ని అందిస్తూ నిత్యనూతన అంశాలను తెలుసు కోవాలనే ఆసక్తిని రేకెత్తించాలి. దాంతో పాటు వాటిని పరిశోధించి అవి సమాజానికి ఏవిధంగా ఉపయోగపడుతాయో చేసి చూపించేలా వారిని తయారు చేయాలి. అందుకు అధ్యాపకుడు సైతం నిత్యనూతన విద్యార్థిగా మారి పరిశోధలను చేస్తూ విద్యార్థులను పరిశోధనలవైపు ఆసక్తిని పెంపొందించుకునేలా చేయాలి. సరిగ్గా అదే కోవకు చెందుతారు సిద్దిపేట ప్రభుత్వ అటానమస్ కళాశాలలో సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ మదన్‌మోహన్. ఇటీవల ఆయన రాసిన పరిశోధనా పత్రం నేపాల్‌లో ఈ నెల 24, 25వ తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ బయోటెక్నాలజీ సదస్సుకు ఎంపికయింది. సిరిసిల్ల జిల్లా మల్కాపూర్ అనే చిన్న గ్రామంలో స్వరూప– సత్తయ్య దంపతులకు జన్మించిన ఆయన ప్రాథమిక విద్య అంతా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేశారు. అలాగే కరీంగనగర్ ప్రభుత్వ డిగ్రీ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో డిగ్రీ, జేఎన్‌టీయూలో పీహెచ్‌డీని పూర్తి చేశారు. తాను చదివిన ఎస్‌ఆర్ ఆర్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకుడిగా చేరి 16 ఏళ్లుగా డిగ్రీ విద్యార్థులకు, ఆరేళ్లుగా పీజీ విద్యార్థులకు సేవలను అందించారు. బదిలీల్లో భాగంగా కరీంనగర్ నుంచి సిద్దిపేట డిగ్రీ కళాశాలకు వచ్చిన ఆయన రెగ్యులర్ సహాయాచార్యుడిగా నియామక మయ్యారు. యంగ్ సైంటిస్ట్, లయన్స్‌క్లబ్ ఉత్తమ ఉపాధ్యాయ, బెస్ట్ రీసెర్చ్ సూపర్‌వైజర్, బెస్ట్ రివైవర్ తదితర అవార్డులను అందుకున్నారు. మెథడాలజీ టెక్నిక్స్ తదితర అంశాలపై మూడు జాతీయ సదస్సులను నిర్వహించారు. వీటితో పాటు 10 అంతర్జాతీయ సదస్సులు, 30 జాతీయ సదస్సులకు హాజరై 24 పరిశోధనా పత్రాలు, 12 పుస్తకాలను ప్రచురించి సమర్పించారు. మంచినీళ్లలో బ్యాక్టీరియాలను కనుగొని పేటెంట్ హక్కులను సైతం సొంతం చేసుకున్నారు. చెరువులు, సాగు భూములు, పుష్కరఘాట్ల నీరు, పానీపూరి, మరుగుదొడ్లలో బ్యాక్టిరీయా వ్యాప్తి, పరిణామాలపై పరిశోధనలు చేశారు. బయో మెట్రిక్, కరచాలనం, జ్యూస్‌లలో కలిపై ఐస్, వేడి పదార్థాల పార్సిల్స్, కండ్లకలక తదితరాల ద్వారా వ్యాప్తి చెందే వైరస్‌లపై విద్యార్థులతో కలిసి పలు పరిశోధనలు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు.

అధ్యాపకులూ నిత్య విద్యార్థులే
Comments
Please login to add a commentAdd a comment