
అభివృద్ధి రయ్‌రయ్!
● గజ్వేల్‌కు కొత్త శోభ
● హెచ్‌ఎండీఏ పరిధిలోకి మరిన్ని కొత్త మండలాలు
● కారిడార్‌తో ప్రయాణం మరింత సులువు
● ప్రగతిలో మరో ముందడుగు
ఇటు ఎలివేటెడ్ కారిడార్.. అటు మెగా హెచ్‌ఎండీఏ
శామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్, మెగా హెచ్‌ఎండీఏ పరిధి పెంపు అంశాలు గజ్వేల్ ప్రాంతానికి కొత్త కళను తీసుకురాబోతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ట్రిపుల్‌ఆర్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న వేళ తాజాగా ఈ రెండు అంశాలతో మరింత కలిసి రానున్నది. ఎలివేటెడ్ కారిడార్‌తో ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరానికి ప్రయాణం సులువుగా మారుతుండగా, మెగా హెచ్‌ఎండీఏ పరిధి పెంపుతో గజ్వేల్‌తోపాటు నియోజకవర్గంలోని కొత్తగా మరిన్ని మండలాలు చేరే అవకాశం కనిపిస్తున్నది. ఈ పరిణామం అభివృద్ధితో మరో ముందడుగుగా మారనున్నది.
గజ్వేల్: నగరానికి సమీపంలో ఉన్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో శరవేగంగా ముందుకెళ్తోంది. హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధితో పరిశీలిస్తే ఒక రకంగా గజ్వేల్ నియోజకవర్గంలోని మండలాలు నగరంతో అతి సమీపంగా మారాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, తూప్రాన్, మనోహారాబాద్, మర్కూక్ మండలంలోని కొంత భాగం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. దీని పరిధి పెంపు ప్రతిపాదన తెరపైకి వస్తుండగా.. గజ్వేల్, మర్కూక్ మండలం పూర్తిస్థాయిలో, అదేవిధంగా జగదేవ్‌పూర్‌తోపాటు సమీప నియోజకవర్గం దుబ్బాకలోని రాయపోల్ మండలాలు కొత్తగా చేరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.
ఎలివేటెడ్ కారిడార్‌తో..
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట నుంచి రామగుండం వరకు 206 కిలోమీటర్ల మేర రాజీవ్‌రహదారి విస్తరించి ఉంది. ఈ రహదారి ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధాన మార్గం. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గానికి కీలకమైన రోడ్డు. గజ్వేల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వారికి శామీర్‌పేట వరకు వెళ్లడం ఒక ఎత్తయితే.. అక్కడి నుంచి ట్రాఫిక్‌లో నగరంలోకి వెళ్లడం గగనంగా మారుతోంది. దీనివల్ల ప్రయాణం నరకప్రాయమవుతోంది. ఇలాంటి తరుణంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతుండటం గజ్వేల్ ప్రాంతానికి కలిసి రానున్నది. ప్రస్తుతం ఇక్కడినుంచి ప్రయాణానికి సుమారు గంటన్నర సమయం తీసుకుంటుండగా ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే కేవలం 45 నిమిషాల్లోనే సికింద్రాబాద్‌కు చేరుకునే అవకాశముంది. ప్రస్తుత ఎలివేటెడ్ కారిడార్ సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి శామీర్‌పేట వరకు సుమారుగా 18కిలోమీటర్లకుపైగా నిర్మాణం జరగనున్నది. ట్రాఫిక్ చిక్కుల్లేకుండా ఈ కారిడార్ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. అత్యాధునిక ప్రమాణాలతో ఈ కారిడార్ రూపుదిద్దుకోనున్నది. ఇది అందుబాటులోకి వస్తే ఇప్పటివరకు పడ్డ ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడనున్నది.
ట్రిపుల్‌ఆర్ పనులు ప్రారంభమవుతున్న వేళ..
ట్రిపుల్‌ఆర్ ఉత్తర భాగం పనుల ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఉత్తర భాగం నిడివి 161.518 కిలోమీటర్లు. ఈ రోడ్డు చౌటుప్పల్, యాదాద్రి–భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్‌ల మీదుగా సంగారెడ్డి వరకు విస్తరించనున్నది. ఇందులో గజ్వేల్ ప్రాంతంలోనే అత్యధికంగా 31.71కిలోమీర్లు ఉన్నది. ఇలాంటి తరుణంలోనే ఈ ప్రాంతానికి మెగా హెచ్‌ఎండీఏ పరిధి పెంపు ప్రతిపాదన, ఎలివేటెడ్ కారిడార్ పనులు మరింత కలిసి రానున్నది. అభివృద్దిలో మరో ముందడుగు పడనున్నది. ప్రత్యేకించి చతికిల పడిన రియల్ ఎస్టేట్‌కు ఈ అంశాలు కలిసి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment