
కాలువ తీరు.. కన్నీరే పారు
అచ్చుమాయపల్లి సమీపంలో కాలువ దుస్థితి
తలాపునే రిజర్వాయర్ ఉన్నా.. నీరు అందని చందంగా తయారైంది చాలా గ్రామాల పరిస్థితి. కాళేశ్వరం పథకంలో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను తొగుట మండలంలో నిర్మించారు. ప్రాజెక్టు పూర్తయి నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా కాలువల నిర్మాణాలు పూర్తికాలేదు. దీంతో పంటపొలాలకు నీరందని దుస్థితి నెలకొంది. దుబ్బాక నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో చెరువులు, కుంటలను నింపే పరిస్థితి లేక పోవడంతో రైతులకు, ప్రజలకు నీటి తిప్పలు తప్పడంలేదు.
ఎవరికీ పట్టని మల్లన్నసాగర్ కాలువలు●
● నాలుగేళ్లుగా అసంపూర్తిగానే నిర్మాణాలు
● చెంతనే ప్రాజెక్టున్నా పారని దుస్థితి
● ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించిన ఎమ్మెల్యేలు
కాల్వలపై అశ్రద్ధ తగదు
మల్లన్నసాగర్ కాలువల నిర్మాణాలపై అశ్రద్ధ తగదు. త్వరగా పూర్తి చేసి చెరువులు, కుంటలకు నీరందించి పంటలను కాపాడాలి. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి కోరాం. అసెంబ్లీ సమావేశాల్లోనూ దృష్టికి తీసుకువచ్చాం. యాసంగిలో నీళ్లు లేక చాలాచోట్ల పంటలు ఎండిపోతున్నాయి.
–కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే
పంటలను కాపాడండి
కాలువ పూర్తయి తమ పొలాలకు నీరందుతుందనే ఆశతో వరినాట్లు వేసుకున్నాం. ఇప్పటికీ పూర్తికాకపోవడం.. ఎండాకాలం కావడం.. బోర్ల నుంచికొద్దిపాటి మాత్రమే నీరు వస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయి. పెద్దచెరువులోకి నీళ్లు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
–గోపాల్‌రెడ్డి, రైతు దుబ్బాక
ఇప్పటికే సగం ఎండిపోయింది
వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. 4 ఎకరాలు వరి వేస్తే ఇప్పటికే సగం ఎండిపోయింది. కాలువల నీరు వస్తదనకుంటే ఇంత వరకు కాలువ పూర్తి చేస్తలేరు. అంతా అయోమయంగా ఉంది. కాలువ నిర్మాణం పూర్తి పంటలను కాపాడాలి.
–రేపాక రాజిరెడ్డి,రైతు
దుబ్బాక: మల్లన్నసాగర్ ప్రాజెక్టు పూర్తయినా చాలా చోట్ల కాలువల నిర్మాణాలు పూర్తి కాలేదు. కాలువల నిర్మాణాలు నాలుగేళ్లుగా సాగుతునే ఉన్నాయి. దుబ్బాక పట్టణంలోని ముస్తాబాద్ రోడ్డులో కాలువ నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో దుబ్బాక పెద్ద చెరువు, పెద్దగుండవెల్లి, దుంపలపల్లి, అచ్చుమాయపల్లి, జోడిచెర్ల, ఆరపల్లి, పోతారం, గంభీర్‌పూర్, శిలాజీనగర్ గ్రామాల్లోని చెరువులు, కుంటలకు నీరందడంలేదు. ఈ సారైనా కాలువ పూర్తి అవుతుందనే ఆశతో పంటలు వేసుకోగా తీరా కాలువ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో వేసిన పంటలు చేతికొస్తాయోలేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కాలువ నిర్మాణం పూర్తి చేసి తమ పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వానికి విన్నపాలు..
మల్లన్నసాగర్ ప్రాజెక్టు అనుసంధానంగా నీరందించే కాలువల నిర్మాణాలు చాలా చోట్ల పెండింగ్‌లో ఉన్నాయంటూ పలుమార్లు ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్తప్రభాకర్‌రెడ్డిలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విన్నవించారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చించారు. త్వరగా కాలువలు పూర్తి చేయాలని విన్నవించారు.
గ్రామాలకు నీరందని దుస్థితి
మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు కేవలం 10–15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మిరుదొడ్డి మండలంతో పాటు అక్బర్‌పేట–భూంపల్లి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని చాలా గ్రామాలకు కాలువల నీరు అందని పరిస్థితి నెలకొంది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కేవలం ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా తొగుట మండలంలోని గుడికందుల, గోవర్ధనగిరి, వర్ధరాజుపల్లి గ్రామాల్లో కాలువల నీరు రాక వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ మండలాల్లో సైతం కాలువ నిర్మాణానికి అటవీశాఖ అధికారుల అనుమతి నిరాకరించడంతో మధ్యలోనే నిర్మాణం ఆగిపోయింది.

కాలువ తీరు.. కన్నీరే పారు

కాలువ తీరు.. కన్నీరే పారు

కాలువ తీరు.. కన్నీరే పారు

కాలువ తీరు.. కన్నీరే పారు
Comments
Please login to add a commentAdd a comment