చెంతనే ప్రాణాంతక చెట్లు
‘కోనోకార్పస్’తో ముప్పు!
● జిల్లా వ్యాప్తంగా విస్తరింపు ● పేరు వింటేనే హడలిపోతున్న జనం ● వెంటాడుతున్న శ్వాసకోశ వ్యాధులు ● గాలి పీల్చినా ప్రమాదమే ● జీవ వైవిధ్యానికి.. పర్యావరణానికి హాని ● తొలగించాలని సర్వత్రా డిమాండ్ ● అయినా స్పందించని అధికారగణం
మిరుదొడ్డి(దుబ్బాక): పచ్చదనం, అందం, ఆకర్శణీయంగా కనిపించే కోనోకార్పస్ చెట్టు పేరు వింటేనే గ్రామీణ, పట్టణ ప్రజలు హడలి పోతున్నారు. ఈ చెట్టు ఉన్న ప్రాంతాల్లో అన్నీ సమస్యలే అంటూ జనం బెంబేలెత్తుతున్నారు. నీటి తడి లేకున్నా సరే మండుటెండలో సైతం పచ్చగా చిగురిస్తూ సకల సమస్యలను తెచ్చిపెడుతోంది. పచ్చదనం పరిశుభ్రత పేరుతో గత హరితహారం కార్యక్రమాల్లో నాటిన ఈ కోనోకార్పస్ చెట్లు జనాలకు రోగాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ చెట్లు పుష్పించి వెదజల్లే పుప్పొడి వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు ఆజ్యం పోస్తాయని డాక్టర్లు సైతం హెచ్చరిస్తున్నారు. వెంటనే ఈ చెట్లను తొలగించాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తున్నా అధికార యంత్రాంగం ముందుకు రావడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎలాంటి ఉపయోగం చేని చెట్టు
హరితగ్రామాలుగా తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో గ్రామీణ పట్టణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా అధికారులు లక్షల్లో కోనోకార్పస్ చెట్లను నాటారు. నీటి ఎద్దడిని తట్టుకునే ఈ చెట్లు తక్కువ కాలంలోనే పచ్చగా ఎదుగుతూ ఆకర్శిణీయంగా మారాయి. ముఖ్యంగా ఈ చెట్ల ఆకులును పశువులుగానీ తినలేవు. కనీసం పక్షులు కూడా వాలలేవు. గూళ్ళు సైతం కట్టలేవు. ఇక రాత్రయిందంటే చాలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దుష్ప్రరిణామాలను చూపించే ఈ చెట్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అనారోగ్య సమస్యలు ఉత్పన్నం
మండుతున్న ఎండల్లో సైతం ఈ చెట్లు పచ్చగా కళకళలాడే ఈ కోనోకార్పస్ చెట్లు సకల రోగాలను అంటగడుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ చెట్లు పుష్పించి గాలిద్వారా వెదజల్లే పుప్పొడి వల్ల శరీరంపై అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధ వ్యాధులకు ఆజ్యం పోస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారు ఈ చెట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
చెట్ల వేళ్లతో సతమతం
అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ఈ కోనోకార్పస్ చెట్ల వేళ్లు సైతం సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా తాగు నీటి సమస్యను అస్తవ్యస్తం చేస్తూ వేళ్లు పాతుకు పోతున్నాయి. మిషన్ భగీరథ పైపుల్లోకి వెళ్ళు చొచ్చుకెళుతుండటంతో నీటి పరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయి గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి పరఫరాను పున:రుద్ధరించడం కోసం మిషన్ భగీరథ సిబ్బంది నానా అవస్థలు పడాల్సి వస్తుంది.
నిషేధం ఉన్నా..
దేశంలోని తెలంగాణ రాష్ట్రంతో పాటు, ఆంధ్ర, గుజరాత్, అసోం, కర్ణాటక వంటి రాష్ట్రాలు నిషేధించినప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులు మాత్రం హరితహారంలో విరివిగా కోనోకార్పస్ చెట్లను నాటుతున్నారు.
చెట్ల చరిత్ర ఇదీ..
కోనోకార్పస్ చెట్లు నాటిన నాటి నుంచి తక్కువ కాలంలోనే వేరు వ్యవస్థ వేగంగా పాతుకుపోవడం వల్ల చెట్లు నిండుగా పచ్చదనంతో ఆకర్శణీయకంగా పెరుగుతాయి. పాశ్చాత్య దేశాల్లో రోడ్లు, పార్కులు, ఉద్యానవనాల్లో సుందరీకరణ కోసం పెంచితే, ఊష్ణ దేశాల్లో సంభవించే ఇసుక తుపాన్లను అడ్డుకోవడానికి తీర ప్రాంతాలల్లో కోనోకార్పస్ చెట్లను విరివిగా పెంచుకుంటారు. అయినప్పటికీ ఎక్కువగా దుష్ఫ్రరిణామాలు కలిగించే ఈ చెట్లను చాలా దేశాలు నిషేధించాయి కూడా.
Comments
Please login to add a commentAdd a comment