
చిన్న వయసులో.. ‘నిర్మల’మైన మనసు
● కష్టాలు ఓరుస్తూ.. కుటుంబ భారం మోస్తూ ● కూరగాయలు అమ్ముతున్న విద్యార్థిని
నారాయణఖేడ్: ఆ కుటుంబానికి కష్టాలు చుట్టముట్టాయి.. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు.. ఇంటినిండా ఆడపిల్లలు.. పెద్దల నుంచి వచ్చిన అర ఎకరం పొలం.. తండాలో చిన్నపాటి ఇల్లు.. ఆ దంపతులు పడరాన్ని పాట్లు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశారు. ముగ్గురు ఆడపిల్లలను పెళ్లిళ్లు చేసి పంపేసరికి రూ.12 లక్షల అప్పు. ఆ కుటుంబం మరింత కష్టాల్లోకి నెట్టి వేయబడింది. ఈ కష్టాలను చూసిన నాలుగో కూతురు ఓ రాణి రుద్రమలాధైర్యాన్నిస్తూ తల్ల్లిదండ్రుల వెన్ను తట్టింది..
నారాయణఖేడ్ మండలం చందర్‌నాయక్ తండాకు చెందిన చందర్, చాందీబాయికి ఆరుగురు సంతానంలో ఐదుగురు కూతుళ్లే. లత, బూలి, బుజ్జి, నిర్మల, వైశాలి తర్వాత పవన్ పుట్టాడు. లత, బూలి, బుజ్జిబాయిల వివాహమైంది. రూ.12 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అర ఎకరం పొలంలో కూరగాయలు పండిస్తూ ఖేడ్ పట్టణంలో విక్రయిస్తున్నారు. నాలుగో కూతురు నిర్మల సిద్దిపేటలో హాస్టల్‌లో ఉంటూ 10వ తరగతిలో 9.8 జీపీఓ ఉత్తీర్ణత సాధించింది. ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చినా తండ్రి అనారోగ్యానికి గురవ్వడం కుటుంబ భారం వల్ల వెళ్లలేదు. ఖేడ్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌లో అడ్మిషన్ అయ్యింది. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఓ కానిస్టేబుల్ కొనిచ్చిన నీట్ ప్రిపరేషన్‌కు సంబంధించిన పుస్తకాలను పఠనం చేస్తుంది. తమ అర ఎకరం పొలంలో నిత్యం పండిన కూరగాయలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. తెల్లవారు 3 గంటలకు వచ్చిన నిర్మల బీట్‌లో కూరగాయలు కొని దుకాణంలో సర్ది 8 గంటల వరకు వ్యాపారం.. అనంతరం తండాకు వెళ్లి 9 గంటలకు కళాశాలకు వెళ్తుంది. ఇలా కష్టపడుతున్న నిర్మల ఆ కుటుంబానికి ధైర్యం ఇస్తూ తన లక్ష్యం డాక్టర్ కావాలని.. మరో సోదరి, సోదరుణ్ణి జీవితంలో వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలని చెబుతుంది. చదువులో నిర్మల మంచి ప్రతిభ కనబరుస్తుందని ఉపాధ్యాయులూ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment