కాంగ్రెస్‌లో కోవర్టులను ఏరేస్తాం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇతర పార్టీలకు కోవర్టులుగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి, ఏరివేస్తామని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మైనంపల్లి మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీకంటే వ్యక్తులు గొప్పకాదన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను అమలుచేయలేని పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం, మాసాయిపేట స్కూల్ బస్సు ప్రమాదాలు జరిగినపుడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏనాడూ బాధితులను పరామర్శించలేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌గా మారినపుడే ప్రజలు వీఆర్‌ఎస్ ఇచ్చారన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం కార్యకర్తలు సమష్టిగా కష్టపడి పని చేయడం హర్షించదగిన విషయమన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి తప్పకుండా గుర్తింపు వస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయానికి అందరం కృషి చేద్దామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. అధిక శాతం రైతులకు రుణమాఫీ అయ్యిందన్నారు. ఈవిషయంలో కావాలనే బీఆర్‌ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బద్నాం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని, జరిగినట్లు నిరూపిస్తే నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని హనుమంతరావు సవాల్ చేశారు. ఎట్ల దోచుకోవాలో, ఎలా దాచుకోవాలో, ఎట్ల పబ్లిసీటీ చేసుకోవాలో బీఆర్‌ఎస్ నాయకులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని ఆరోపించారు. కార్యక్రమంలో సిద్దిపేట, మెదక్ జిల్లాల పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి, ఆంజనేయులు గౌడ్, నాయకులు హరికృష్ణ, అత్తు ఇమామ్, యాదగిరి, లక్ష్మి, శ్రీనివాస్, మహేందర్, సతీష్, ఎల్లం యాదవ్, శివప్ప, బుచ్చిరెడ్డి, ఆనంద్, దాస అంజయ్య, రియాజ్, గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పార్టీ సీనియర్ నేత హనుమంతరావు స్పష్టీకరణ
జిల్లా కేంద్రంలో నాయకులు,కార్యకర్తలతో సమావేశం
Comments
Please login to add a commentAdd a comment