బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంపై ఉచిత శిక్షణ
● 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ
● టీజీబీసీ స్టడీ సర్కిల్ జిల్లా డైరెక్టర్ దయాసాగర్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంపై నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు టీజీబీసీ స్టడీ సర్కిల్ సిద్దిపేట డైరెక్టర్ కృష్ణ దయాసాగర్ బుధవారం తెలిపారు. ఈ శిక్షణ హైద్రాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ పూర్తయి, 26 ఏళ్లు లోపు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు 15 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 12 నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రంలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు టీజీబీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం
గజ్వేల్‌రూరల్: పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పుస్తకాల పంపిణీ
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి హైస్కూల్‌కు లయన్స్, స్నేహ క్లబ్‌లు సంయుక్తంగా విద్యార్థులకు బుధవారం కెరియర్ గైడెన్స్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధి విజయభాస్కర్ మాట్లాడుతూ పదోతరగతి పరీక్షల అనంతరం ఉన్నత చదువుల్లో చేరేందుకు ఈ పుస్తకాలు ఉపయోగపడుతాయన్నారు. పదోతరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.5వేలు పారితోషికం అందజేస్తామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ బచ్చలి సత్తయ్య, క్లబ్ ప్రతినిధులు పరమేశ్వర్ చారి, కుమారస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మినీ వాటర్‌ప్లాంట్ వితరణ
వర్గల్(గజ్వేల్): మండల పరిధిలోని నాచారం జెడ్పీ ఉన్నత పాఠశాలకు బుధవారం జూబ్లిహిల్స్ రోటరీక్లబ్ రూ.85 వేలు విలువైన మినీ వాటర్‌ప్లాంట్, విద్యార్థులకు క్రీడా దుస్తులను అందజేసింది. కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు బాలకోటారెడ్డి, లక్ష్మి, విజయలక్ష్మి, రాజా కిషన్, హెచ్‌ఎం ఉమారాణి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ కళాశాలలో చేరండి
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పూర్తికాగానే డిగ్రీ కోర్సుల కోసం తమ కళాశాలలో చేరాలంటూ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రినిపాల్, అధ్యాపకులు విద్యార్థినులను కోరారు. ప్రిన్సిపాల్ జీవన్‌కుమార్, అధ్యాపకులు ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల వద్ద బుధవారం విద్యార్థినులను కలిసి కరపత్రాలను పంచారు. కళాశాలలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, ఈ లైబ్రరీ, ఐసీటీ క్లాస్‌రూంలు ఉన్నాయని వారికి వివరించారు.
మెరుగైన వైద్యమే లక్ష్యం
గజ్వేల్‌రూరల్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన పలువురికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సర్దార్‌ఖాన్, నాయకులు సుఖేందర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, యాదగిరి, రాములుగౌడ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
విస్తరాకుల్లో మధ్యాహ్న భోజనం
అక్కన్నపేట(హుస్నాబాద్): మండల పరిధిలోని అంతక్కపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బుధవారం విస్తరాకుల్లో భోజనాలు చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మోహన్‌నాయక్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి విద్యార్థుల్లో అవగాహన పెంచుతున్నామన్నారు. అందులో భాగంగా విస్తరాకుల్లో భోజనం వడ్డించేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీంతో పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగదని వివరించారు. కార్యక్రమంలో మహిళా సంఘం సీఏలు రంగమ్మ, అంజలి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఓ వ్యక్తికి రిమాండ్
నంగునూరు(సిద్దిపేట): కోర్టు పేషీలకు హాజరుకాని ఒకరిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ఆసీఫ్ తెలిపారు. దర్గపల్లికి చెందిన ఆసర్ల యాదయ్యపై 2021లో రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో కోర్టు పేషీలకు హాజరుకావడం లేదు. దీంతో బుధవారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చే యడంతో రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment