
అగ్నికి ఆహుతి.. నష్టాన్ని మిగిల్చి
మక్క చేను దగ్ధం
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రమాదవశాత్తు మక్క చేను దగ్ధమైన ఘటన మండల పరిధిలోని మల్లుపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధిత రైతు మంతూరి కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్ కరెంటు తీగలు ఒకదానికొకటి రాపిడై నిప్పు రవ్వలు ఎగసి పడటంతో మక్క చేను కాలి బూడిదైపోయింది. ఇందులో మక్క పంటతోపాటు, ఎకరంలో వేసిన డ్రిప్ పైపులు, గేట్ వాళ్లు కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు తనకు నష్ట పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరాడు.
చిన్నకోడూరులో మామిడి తోట
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మామిడి తోట దగ్ధమైన ఘటన మండల పరిధిలోని రామంచ శివారులో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎడ్ల బాల్‌రెడ్డికి 10 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ తోటను సిద్దిపేటకు చెందిన రామోజీ లీజ్‌కు తీసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలార్పినప్పటికీ తోట పూర్తిగా దగ్ధమైంది. తోటలో ఉన్న డ్రిప్ పైపులు కాలిపోయాయి. సుమారు రూ. 8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.

అగ్నికి ఆహుతి.. నష్టాన్ని మిగిల్చి
Comments
Please login to add a commentAdd a comment