
భార్యా బిడ్డలకు దూరమై.. జీవితమే భారమై
బంగారం శుద్ధి చేసే విషం తాగి
స్వర్ణకారుడు ఆత్మహత్య
పాపన్నపేట(మెదక్): మిల మిల మెరిసే బంగారు ఆభరణాలు తయారు చేసే అతడి కుటుంబ జీవితంలో చీకటి కోణాలు దాగి ఉన్నాయి. తాత్కాలిక ఆవేశాలతో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కొంప ముంచింది. రోజు వారి వేధింపులు భరించలేక ఇద్దరు బిడ్డలను తీసుకొని ఆ ఇల్లాలు పుట్టింటికి వెళ్లిపోయింది. మీరు లేని జీవితం నాకొద్దంటూ ఆ స్వర్ణకారుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అవుసుల రాములు మేడ్చల్‌లో కుల వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతడికి భార్య సరళ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుటుంబ విషయంలో భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. సరళ కొద్ధి రోజుల కిందట పిల్లలను తీసుకొని పుట్టినిల్లు ఎల్లారెడ్డికి వెళ్లి పోయింది. దీంతో తీవ్ర మనో వేదనకు గురైన రాములు స్వగ్రామమైన కొత్తపల్లికి వచ్చి బంగారం శుద్ధి చేసే విషం తాగాడు. బుధవారం గ్రామ శివారులోని మెయిన్ రోడ్డు పక్కన శవమై కనిపించాడు. మృతుడి తమ్ముడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
జోగిపేట(అందోల్): జోగిపేట పట్టణంలోని బజాజ్ షోరూం ఎదురుగా పేకాట ఆడుతున్న ఐదుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ పాండు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడి నిర్వహించగా గోపాల్, శ్రీశైలం, నాగరాజు, మల్లేశం, వెంకటేశం పేకాట ఆడుతుండగా అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.47 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment